కౌన్సిలర్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి నామినేషన్

11 Mar, 2014 13:30 IST|Sakshi
కౌన్సిలర్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి నామినేషన్

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని పేర్కొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనూహ్యంగా సోమవారం తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని 18, 34 వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు చివరి నిమిషంలో తన అనుచరులతో వచ్చి టీడీపీ తరపున నామినేషన్లు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఈ వార్డుల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ ఎత్తు వేశారనే చర్చ జరుగుతోంది. ఈ రెండు వార్డుల్లో ఏదో ఒక వార్డు నుంచి ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిపించి.. జేసీ తన నామినేషన్లు ఉపసంహరించుకుంటారని సమాచారం.
 
తొలి రోజు 11 నామినేషన్లు
అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోసం సోమవారం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక కార్పొరేషన్, 11 మునిసిపాలిటీల పరిధిలోని 373 వార్డులు ఉన్నాయి. మొదటి రోజున సోమవారం అనంతపురం కార్పొరేషన్, ఐదు మునిసిపాలిటీల్లో  11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున నాలుగు, టీడీపీ తరఫున 7 నామినేషన్లు వచ్చాయి.

మరిన్ని వార్తలు