జేసీ కుమారుడు సర్కార్‌ బడికి..

17 Sep, 2019 11:32 IST|Sakshi
కస్పా ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నుంచి కుమారుడి ప్రవేశపత్రం అందుకుంటున్న జేసీ–2 కూర్మనాథ్‌

ఒక్కగా నొక్క కొడుకును ప్రభుత్వ బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచిన జేసీ–2 కూర్మనాథ్‌ 

సాక్షి, విజయనగరం: కుటుంబ పోషణ కోసం రోజం తా కష్టపడే కూలీ సైతం తమ పిల్లలను కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివించాలని తపన పడుతున్న రోజులివి. వాటికి భిన్నంగా..  ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించేలా.. తన తోటి అధికార యంత్రాంగానికి ఆదర్శంగా నిలిచేలా జేసీ–2 కూర్మనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఒక్కగానొక్క కుమారుడు ఆర్‌.త్రివిక్రమ్‌ను విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న కస్పా ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో సోమవారం ఉదయం చేర్పిం చారు. హెచ్‌ఎం శంకరరావు నుంచి ప్రవేశ ధ్రువీ కరణపత్రం తీసుకున్నారు. అనంతరం స్వయం గా తనే తరగతి గదికి కుమారుడిని తీసుకెళ్లి సహ విద్యార్థుల మధ్య కూర్చోబెట్టారు.

ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచేందుకే... 
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోంది.. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వి నియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు తన కొడుకుని ప్రభుత్వ బడిలో చేర్పించినట్టు జేసీ–2 కూర్మనాథ్‌ వెల్లడించారు. విద్యార్థి చిన్నతనం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలన్నీ ప్రభుత్వ బడులలో అందుబాటులో ఉంటాయన్నారు. తద్వారా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేవలం చదువులోనే కాకుండా శారీరక దారుఢ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్, సమాజం పట్ల అవగాహన ప్రభుత్వ పాఠశాలల్లో సాధ్యపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం  మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేయడంతో పాటు అమ్మఒడి పథకం అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఉపకార వేతనాలు అందజేస్తోందని తెలిపారు. వీటి కోసం బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వబడుల్లో చక్కగా బోధించే ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు చదువుకునే వాతావరణం ఇంటివద్ద కల్పిస్తే చాలన్నారు.  

మరిన్ని వార్తలు