ఆషాఢం జోష్

1 Jul, 2014 00:55 IST|Sakshi
ఆషాఢం జోష్
  • టోకు ధరకే రిటైల్ అమ్మకాలు
  •  ఆసక్తి చూపుతున్న నగర ప్రజలు
  •  కిటకిటలాడుతున్న షాపింగ్‌మాల్స్
  • విశాఖపట్నం : నగరంలో ఆషాఢం సందడి కనిపిస్తోంది. షాపింగ్ మాళ్లు ఆషాఢం సేల్ పేరిట బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొనుగోలుదారులతో షోరూమ్స్ కళకళలాడుతున్నాయి. కొన్ని షోరూమ్‌లు 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. మరికొన్ని ప్లాట్ 50 శాతం రాయితీ ఇస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి.

    ఆశీల్‌మెట్ట, వీఐపీ రోడ్డు, ద్వారకానగర్, దొండపర్తి, అక్కయ్యపాలెం, కంచరపాలెం ప్రాంతంలోని పలు షోరూమ్‌లు పరిమిత రోజులు రాయితీ ప్రకటించగా, జగదాంబ జంక్షన్, పూర్ణామార్కెట్, గాజువాక, ఎన్‌ఏడీ, గోపాలపట్నంలోని షోరూమ్‌లు ఆషాఢమాసం అంతా రాయితీలు ప్రకటించాయి.

    శ్రావణ మాసంలో సరికొత్త స్టాక్ కోసం క్లియరెన్స్ సేల్‌పేరుతో మరికొన్ని షాపులు రాయితీల వర్షం కురిపిస్తున్నాయి. టోక్ ధరకే రిటైల్‌గా విక్రయాలు జరుపుతుండటంతో ఇదే మంచి తరుణంగా భావించిన నగరవాసులు షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శ్రావణ మాసంలో శుభకార్యాల కోసం ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు.
     
    పెరిగిన వ్యాపారం : ఆషాఢమాసంలో శుభకార్యాలు జరగకపోవడంతో వస్త్ర దుకాణదారులు ఆన్‌సీజన్‌గా భావించేవారు. ఆ సమయంలో వ్యాపారాలు పెంచుకునేందుకు రాయితీ ప్రకటించేవారు. ప్రస్తుతం వస్త్ర దుకాణాలతోపాటు జ్యూయలరీ, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, సెల్ పాయింట్స్ వంటి అన్ని షోరూమ్‌లు ఆషాఢం ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలుకు డౌన్ పేమెంట్ లేకుండా రుణసదుపాయం కల్పిస్తూ ఆకర్షిస్తున్నారు. జ్యూయలరీ వ్యాపారులు తరుగు, మజూరీలపై రాయితీ ఇస్తున్నారు. దీంతో సాధారణ రోజుల కన్నా 30 శాతం వ్యాపారం పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
     
     జాగ్రత్తలు అవసరం
     రాయితీలు ఇస్తున్న షాపుల్లో కొనుగోలు చేసే సమయంలో పరిశీలన ఎంతో అవసరం
         
     గత ఏడాది అదే షాపుల్లో కొనుగోలు చేసినప్పుడు నాణ్యతలో ఏమైనా తేడా ఉందా.. వేరే షాపుల్లో మనం కొనుగోలు చేసే వస్తువు ధర, రాయితీ ఇస్తున్న షాపులో ఉన్న ధరలతో పోల్చి చూసుకోవాలి
         
     ఒకటి కొంటే మరొకటి ఉచితమని ప్రకటించే చోట వాటి నాణ్యతా ప్రమాణాలు బేరీజు వేసుకుని కొనుగోలు చేయాలి.
     

మరిన్ని వార్తలు