రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? : కన్నా

19 Feb, 2019 13:36 IST|Sakshi

సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు సభకోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. చారిత్రక కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన ఓ రైతు కుటుంబం ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. మీ రైతు వ్యతిరేక వైఖరితో మరో రైతుని బలిచేశారని చంద్రబాబుపై కన్నా ట్విట్టర్‌లో నిప్పులు చెరిగారు. 'పొలాన్ని దేవాలయంగా భావించే రైతు పట్ల మీరు అధికార దర్పాన్ని చూపి పోలీసులతో కొట్టించడం వలన ప్రాణాలు విడిస్తే కనీసం కేసు, విచారణ లేకుండా ఆత్మహత్య అని ఎలా మీరు ప్రకటిస్తారు? ప్రజలకు వర్తించే చట్టాలు మీకు వర్తించవా?

కొండవీడు ఉత్సవాల ఏర్పాట్ల కోసం కోటయ్యకు చెందిన పచ్చని పంటపొలాలను తన సమ్మతి లేకుండా తీసుకునే హక్కు మీకు, పచ్చ కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసులకు ఎవరిచ్చారు?!
సామాన్య రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? మీలాంటి దౌర్జన్యం చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం' అని పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సభ పేరుతో కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడం, పొలంలోకి రాకుండా తనను అవమానించడంతో ఓ రైతన్న తల్లడిల్లాడు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్‌ దెబ్బలకు రైతు నేలకొరిగిన ఘటన సోమవారం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని మృతుడి కుమారుడు వేడుకున్నా  పోలీసులు అందుకు అంగీకరించలేదు. సీఎం వస్తున్నారంటూ అంబులెన్స్, ఆటోలను కూడా రానివ్వలేదు. చేసేదిలేక చేతులపైనే కోటయ్యను గ్రామస్థులు మోసుకెళ్లారు. మార్గమధ్యలోనే కోటయ్య ప్రాణాలు విడిచాడు.

మరిన్ని వార్తలు