రాజస్థాన్‌ ఎన్నికలపై పాక్‌ కన్ను.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

16 Nov, 2023 17:00 IST|Sakshi

రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సౌత్‌ ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ రమేష్‌ బిధూరి..మరోసారి నోరుజారి వార్తల్లోకెక్కారు.

బీజేపీ ఎంపీ రమేష్‌ బిధూరి.. రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గానికి ఎన్నికల ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఓ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భారతదేశంతోపాటు పాకిస్థాన్‌ కూడా రాజస్థాన్‌ ఎన్నికలపై కన్నేసి ఉంచిందని అన్నారు. టోంక్ స్థానంపై లాహోర్‌ కన్నేసిందన్నారు. నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) సభ్యులకు టోంక్ ప్రజలు ఆశ్రయం కల్పిస్తున్నరని ఆరోపించారు.

‘ఇక్కడి ఎన్నికలపై లాహోర్ నిఘా ఉంచింది. ఎన్నికల తర్వాత లాహోర్‌లో లడ్డూలు పంపిణీ చేయకుండా జాగ్రత్త వహించాలి. రాబోయే ఎన్నికల ఫలితాలపై హమాస్ వంటి ఉగ్రవాదుల కన్ను కూడా ఉంది’ అంటూ బిధూరి వ్యాఖ్యానించారు. కాగా టోంక్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ పోటీ చేస్తుండటం గమనార్హం.
చదవండి: సుప్రీంకోర్టు మొట్టికాయ.. మరోసారి తమిళనాడు గవర్నర్‌ వివాదాస్పద నిర్ణయం

అయితే బిధూరి ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఇదేం తొలిసారి కాదు. గత పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ కున్వర్ డానిష్ అలీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బిధురిపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలు అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీకి కీలకంగా మారాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే రాజస్థాన్‌లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకోలేకపోవడంతో.. ఈ అవకాశంతో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. డిసెంబర్‌ 3న వెలువడబోయే ఫలితాలతో రాజస్థాన్‌ ఎవరి వశం కాబోతుందో తెలనుంది. 

మరిన్ని వార్తలు