‘వారికి భరోసా ఇచ్చే విధంగా రైతు దినోత్సవం’

6 Jul, 2019 15:49 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : రైతులకు భరోసా ఇచ్చే విధంగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి(జూలై 8)ని రైతు దినోత్సవంగా జరుపుతామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో శనివారం మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి కార్యక్రమంగా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. తొలిసారి జరిగిన అగ్రికల్చర్‌ మిషన్‌ సమావేశంలో సీఎం సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. ప్రతినెలా విధిగా సమావేశం అవ్వాలని, రైతు సంబంధింత అంశాలను చర్చించాలని అధికారులకు సూచించారన్నారు. మూడు వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇది అగ్రికల్చర్‌ మిషన్‌ పరిధిలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

గతంలో రైతుల మార్కెటింగ్‌ అంశాన్ని పూర్తిగా విస్మరించారని, రెండు వేల కోట్లతో ఏర్పాటు చేసే విపత్తు సహాయ నిధి కూడా ఈ మిషన్‌ పరిధిలోనే ఉండాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత కోసం నియోజకవర్గాని ఒకటి చొప్పున ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయిల్‌పామ్‌ రైతులకు తెలంగాణ తరహాలోనే చెల్లింపులు చేపడతామరని.. పొగాకు, కొబ్బరి రైతులను కూడా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నాఫెడ్‌ కొనుగోలు చేసే కొబ్బరి మార్కెట్‌ సెస్‌ను రద్దు చేశామని తెలిపారు. కౌలు చట్టంలో మార్పులు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. భూ యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా ఈ చట్టం తీసుకువస్తామని పేర్కొన్నారు. సహకార రుణాలు సక్రమంగా అందించేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. బ్యాంకులు రైతుల మీదకు ఒత్తిడి తేకుండా ఉండేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు