సినిమా నిర్మించి రూ.2 కోట్లు నష్టపోయా: యంగ్‌ హీరో

14 Dec, 2023 11:11 IST|Sakshi

తమిళసినిమా: యువ నటుడు ఆదవా ఈశ్వరా కథనాయకుడిగా నటించి, కేఎస్‌ఆర్‌ ఫిలిండమ్‌ పతాకంపై నిర్మించిన చిత్రం భాయ్‌. నటి శ్రీఇనియా నాయకిగా నటించిన ఈ చిత్రానికి కమల్‌ నాథన్‌ భువన్‌ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో నిర్మాత, నటుడు కే.రాజన్‌, దర్శకుడు పేరరసు, నటుడు జీవా, తమిళనాడు పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు సుభాష్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, నిర్మాత ఆదవా ఈశ్వరా మాట్లాడుతూ తాను ఇంతకు ముందు రూ.2 కోట్లు ఖర్చుతో చిత్రాన్ని నిర్మించానన్నారు. అయితే అది ఇప్పటికీ విడుదల కాకపోవడంతో పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని నష్టపోయానన్నారు. ఆ తరువాత హీరోగా నటించిన చిత్రం సరిగా ఆడలేదన్నారు. తాజాగా భాయ్‌ చిత్రాన్ని చేసినట్లు చెప్పారు. ఇక్కడ చిన్న చిత్రాలకు ప్రోత్సాహం, ఆదరణ లేవన్నారు. చిన్న చిత్రాలను ఆదరిస్తేనే మరి కొందరు కొత్త నిర్మాతలు వస్తారని అన్నారు. తనకు సినిమా మినహా వేరే వృత్తి తెలియదన్నారు. అందుకే నష్టపోయినా, మళ్లీ మళ్లీ చిత్రాలు చేస్తున్నట్లు చెప్పారు.

తాను ఊటీలో రెండో క్లాస్‌ చదువుతున్న సమయంలో కోయంబత్తూర్‌లో బాంబ్‌ బ్లాస్ట్‌ సంఘటన జరిగిందన్నారు. అది తమ ఇంటి వెనుక భాగంలో జరగడంతో ఆందోళనకు గురయ్యానన్నారు. ఆ ఘటనకు తమ ఇళ్లు, డబ్బు అంతా నాశనం అయ్యిందన్నారు. అలాంటి బాంబ్‌ బ్లాస్టర్లు ఎందుకు జరుగుతున్నాయో తెలియదన్నారు. అయితే ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అలాంటి ఇతి వృత్తంతో తెరకెక్కించిన చిత్రం భాయ్‌ అని చెప్పారు. ఇది మానవత్వం ప్రదానాంశంగా రూపొందించిన కథా చిత్రం అని ఆదవా ఈశ్వరా తెలిపారు.అయితే చిత్ర నిర్మాణంలో పలు సమస్యలను ఎదురొడ్డి పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు