ఫినాయిల్ తాగిన కేజీబీవీ విద్యార్థిని

21 Jul, 2015 23:49 IST|Sakshi

  సకాలంలో చికిత్సతో తప్పిన ప్రాణాపాయం
 గరుగుబిల్లి: మండలంలోని రావివలస కస్తూరిబా బాలికల విద్యాలయలో 8వ తరగతి చదువుతున్న పి.శ్రావణి అనే విద్యార్థిని మంగళవారం ఉదయం ఫినాయిల్ తాగింది. దీన్ని గమనించిన సిబ్బంది గ్రామంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.  శ్రావణికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. శ్రావణి తల్లిదండ్రులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. గతేడాది వరకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలలో చదివిన శ్రావణిని ఈ ఏడాది మండలంలోని దళాయివలసలో ఉన్న తాత గులిపిల్లి సత్యంనాయుడు వద్దకు పంపారు.
 
 ఆయన రావివలస కేజీబీవీలో చేర్పించారు. అయితే ఇక్కడ చదవటం శ్రావణికి ఇష్టం లేదని సమాచారం. పుష్కరాలకు సెలవులు ప్రకటించటంతో పదోతరగతి విద్యార్థులను మినహ మిగిలినవారిని ఇళ్లకు పంపేశారు. శ్రావణి మాత్రం తాతగారి ఇంటి కి వెళ్లనని చెప్పి పాఠశాలలో ఉండిపోయింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలు ముగించుకున్నాక బాత్‌రూమ్‌లోని ఫినాయిల్‌ను తాగేసింది. బాటిల్‌లో ఉన్నది ఫినాయిల్ అని తెలియక తాగానని ఆమె చెప్పటం గమనార్హం. కేజీబీవీలో చదవటం ఇష్టం లేక ఇలా చేసిందా, పాఠశాలలో ఏమైనా సమస్యలున్నాయా.. అనేది విచారణలో తేలాల్సి ఉంది. కొద్దిరోజుల క్రితం పాఠశాలలోనే ఇలాంటి సంఘటనే చోటు చేసుకోగా బయటకు రాకుండా సిబ్బంది జాగ్రత్తపడ్డారని స్థానికులంటున్నారు.
 
 ఎందుకు తాగిందో తెలియదు..
 పాఠశాలకు ప్రస్తుతం సెలవులిచ్చాం. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. మిగిలిన విద్యార్థులను ఇళ్లకు పంపాం. శ్రావణి తాతగారికి ఇంటి వెళ్లనంది. ఫినాయిల్ ఎందుకు తాగిందో తెలియదు. ఎంత ప్రశ్నించినా తెలియక తాగానని చెబుతోంది. ఆమె బంధువులకు సమాచారమిచ్చాం. శ్రావణికి అవసరమైన వైద్యసేవలనందిస్తున్నాం.
 -జె.సంధ్య, ప్రత్యేకాధికారి, కేజీబీవీ
 

మరిన్ని వార్తలు