‘గేమింగ్’లో భవితకు పునాది

9 Jan, 2014 02:41 IST|Sakshi
‘గేమింగ్’లో భవితకు పునాది

గేమ్ పార్క్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

సాక్షి నెట్‌వర్క్: ప్రపంచంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న గేమింగ్ యానిమేషన్‌కు ఇప్పుడు తాము వేస్తున్నది ఒక పునాది అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానిం చారు. గేమింగ్ యానిమేషన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్(గేమ్) పార్కుకు బుధవారం రాయదుర్గంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 ఎకరాల్లో రూ. 350 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో 15 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 250 రకాల సేవలందిస్తున్న మీసేవను దేశంలోనే తొలి వినూత్న కార్యక్రమంగా కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఆస్కార్ అవార్డు పొందిన ‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రానికి యాని మేషన్ వర్క్ 80 శాతం హైదరాబాద్‌లోనే జరిగిందంటే అందులో మన రాజధాని పులేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వేతనాలు, పెన్షన్లకే ఖజానా నుంచి రూ. 50 వేల కోట్లు ఖర్చవుతోందని, ఇటీవలి ఐఆర్‌తో రూ. 59 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇబ్బందికరమే అయినా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ గేమ్ పార్కులో ఎంటర్‌టైన్‌మెంట్ అకాడమీ లేదా వర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రూ.500 కోట్లతో ఏర్పాటు చేసే హార్డ్‌వేర్ క్లస్టర్‌లో 65 కంపెనీలు తమ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నాయని చెప్పారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ప్రసాద్, ఐటీ కార్యదర్శి సంజయ్ జాజూ, ఏపీఐఐసీ ఎండీ జయేష్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గేమ్ పార్కుకు కేటాయించిన భూమి తమదేనని, ప్రత్యామ్నాయం చూపకుండా ఆ భూమిని ఐటీ శాఖకు ఎలా బదలాయిస్తారంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఏపీఐఐసీ తమను మోసం చేసిందంటూ మైహోమ్ చైర్మన్ రామేశ్వరరావు ఆరోపించారు. దీనిపై సీఎం స్పందిస్తూ, ఎవరికీ నష్టం కల్గించబోమని, సమస్య ఏదైనా ఉంటే తమ వద్దకు రమ్మని సూచించారు.
 
 టీ భూములతో సీఎం సొమ్ము చేసుకుంటున్నారు

 తెలంగాణ భూములను కారు చౌకగా అమ్ముకొని సీఎం కిరణ్ సొమ్ము చేసుకుంటున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, రాజయ్య, భిక్షపతి యాదవ్, నల్లాల ఓదేలు ఆరోపించారు. గేమ్ పార్కును ప్రారంభించడానికి వచ్చిన సీఎంను అడ్డుకునేందుకు వారు ప్రయత్నించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభాస్థలి వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన హరీశ్‌రావుతోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల్ని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి, నార్సింగ్ పీఎస్‌కు తరలించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. నార్సింగ్ పీఎస్ వద్ద హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న తరుణంలో విలువైన ప్రభుత్వ భూములను గేమింగ్ పార్కుకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని సీఎంతో పాటు మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

మరిన్ని వార్తలు