కొత్తపల్లి గీతకు కుల వివాదంపై నోటీసు

30 Oct, 2014 02:04 IST|Sakshi
కొత్తపల్లి గీతకు కుల వివాదంపై నోటీసు

హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి

విజయనగరం: అరకు ఎంపీ కొత్తపల్లి గీత కుల వివాద ఉచ్చులో చిక్కుకున్నారు. ఆమె ఎస్టీ కాదని మొన్నటి సాధారణ  ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో వేసిన పిటిషన్ అడ్మిట్ అయింది. ఈనెల 31న హాజరు కావాలని గీతకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఇప్పుడీ పరిణామం టీడీపీని డైలామాలో పడేసింది.  అరకు ఎంపీగా ఎన్నికైన తర్వాత కొత్తపల్లి గీత ఎస్టీ కాదని టీడీపీ  గట్టిగా వాదించింది. ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించింది. ఆమె ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి చేత హైకోర్టులో పిటిషన్ కూడా వేయించింది.

అందుకు తగ్గ పూర్తి సహాయ సహకారాలను టీడీపీ నాయకత్వం  అందజేసింది. ఇదంతా పసిగట్టో, కుల వివాదం నుంచి బయటపడాలనో ఎన్నికైన కొన్ని నెలల్లోనే కొత్తపల్లి గీత స్వరం మార్చారు.  టిక్కెట్ ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగామాట్లాడటం ప్రారంభించారు. టీడీపీ నేతలతో అంటకాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో టీడీపీ డిఫెన్స్‌లో పడింది. తమ పార్టీ నాయకులతో కలిసి తిరుగుతున్న ఎంపీ గీతపై ఎలా స్పందించాలో తెలియకో, అధిష్టానం డెరైక్షనో తెలియదు గాని  పార్టీ సహాయ సహకారాలతో పిటిషన్ వేసిన గుమ్మడి సంధ్యారాణి  ఇప్పుడు కనీసం స్పందించలేదు.
 

మరిన్ని వార్తలు