పేదల బతుకులు కూల్చేశారు!

8 Jun, 2018 12:16 IST|Sakshi
ఇదెక్కడి న్యాయమంటూ పోలీసులను ప్రశ్నిస్తున్న బాధితులు

ప్రత్యామ్నాయం చూపకుండానే ఇళ్ల కూల్చివేత

వీధిన పడిన సోనియాగాంధీనగర్‌ వాసులు  

40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామంటూ బాధితుల ఆవేదన

కర్నూలు సీక్యాంప్‌ : వారంతా పేదలు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. పొద్దున్నే బతుకు‘బండి’ తీసుకుని రోడ్డుపైకి వెళితే..రాత్రి పొద్దుపోయాక గానీ ఇళ్లకు తిరిగి రారు. వారంతా 40 ఏళ్లుగా అక్కడే బతుకుతున్నారు. అప్పట్లో ఖాళీ స్థలాల్లో పూరిగుడిసెలు, చిన్నపాటి ఇళ్లు నిర్మించుకున్నారు. వీటిని గురువారం నగర పాలక సంస్థ అధికారులు ఉన్నఫళంగా కూల్చేశారు. దాదాపు వంద కుటుంబాలను వీధిన పడేశారు. ‘అయ్యా..మాలాంటి పేదోళ్లపైనా మీ ప్రతాపం’ అంటూ బాధితులు కన్నీటి పర్యంతమైనా అధికారులు కనికరం చూపలేదు.  కర్నూలు నగరంలోని సోనియాగాంధీ నగర్‌లో రోడ్డుపక్కన ఉన్న ఇళ్లు, గుడిసెల్లో పలువురు పేదలు నివాసముంటున్నారు. నగర పాలక సంస్థకు నీటి పన్ను, ఇంటిపన్నులు కడుతున్నారు.

విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుని..వాటి బిల్లులూ చెల్లిస్తున్నారు. అయితే..వీరి కారణంగా రోడ్డు ఆక్రమణకు గురైందని,ఇళ్లు, గుడి సెలను తొలగించాలంటూ సీతారాంనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు గతంలో హైకోర్టుకు వెళ్లారు. వారికి ప్రత్యా మ్నాయం చూపి కట్టడాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వారికి అధికారులు జగన్నాథగట్టుపై స్థలాలు చూపారు. అక్కడ నివాసముంటూ నగరంలోకి వచ్చి చిరువ్యాపారాలు, కూలి పనులు చేసుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో బాధితులు సోనియాగాంధీ నగర్‌లోనే నివాసముంటున్నారు.

అనువైన చోట ప్రత్యామ్నాయం చూపాలన్నది వారి భావన. అయితే..ఇదేమీ పట్టించుకోకుండానే గురు వారం నగర పాలక సంస్థ అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో వచ్చి జేసీబీల సాయంతో ఇళ్లు,గుడిసెలను కూలగొట్టారు.సీతారాంనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యు లు ఈ స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారికి అధికారులు కూడా అండగా నిలవడం బాధాకరమని బాధితులు వాపోయారు. తక్షణమే తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్‌ ఎదుట మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు