వేరుశనగ రైతు లబోదిబో...

29 Oct, 2014 01:53 IST|Sakshi
వేరుశనగ రైతు లబోదిబో...

అనంతపురం అగ్రికల్చర్ :
 వేరుశనగ పంట ‘అనంత’ రైతుల పాలిట శనిలా దాపురించింది. ఏటా భారీ నష్టాలు తెచ్చిపెడుతున్నా ప్రత్యామ్నాయ మార్గం లేక వేరుశనగ పంటనే నమ్ముకుని సాగు చేస్తున్నారు. కానీ ఫలితం పునరావృతమవుతూనే ఉంది. ఈ ఏడాది కూడా వేరుశనగ పంట దిగుబడులు దారుణంగా పడిపోయాయి. వ్యవసాయ, ప్రణాళికశాఖ అధికారులు చేపట్టిన పంట కోత ప్రయోగాల ఫలితాలు (క్రాప్ కటింగ్ ఎక్స్‌పెరిమెంట్స్) చూస్తే వేరుశనగ పంట దిగుబడులు ఎంత దారుణంగా ఉన్నాయో అవగతమవుతుంది.

కొన్ని ప్రయోగాల్లో ‘జీరో’ దిగుబడులు వచ్చాయంటే రైతులు ఎంతగా నష్టపోయారో తెలుస్తుంది.
 దెబ్బతీసిన వర్షాభావం... ఖరీఫ్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఈ ఏడాది వేరుశనగ పంట 5,06,929 హెక్టార్లకు పడిపోయింది. అందులో 4.96 లక్షల హెక్టార్లు వర్షాధారంగానూ తక్కినది నీటి వసతి కింద సాగు చేశారు. అయితే జూన్ నెలలో 63.9 మిల్లీమీటర్లు (మి.మీ) గానూ 44.9 మి.మీ, జూలైలో 67.4 మి.మీ గానూ 35.7 మి.మీ, ఆగస్టులో 88.7 మి.మీ గానూ 56.8 మి.మీ, సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గానూ కేవలం 35 మి.మీ వర్షం కురిసింది.

అంటే ఖరీఫ్‌లో 335.4 మి.మీ వర్షం పడాల్సివుండగా 50 శాతం తక్కువగా 172 మి.మీ వర్షం పడింది. ఐదారు మండలాలు మినహా తక్కిన ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. ప్రధానంగా కీలకమైన సెప్టెంబర్ నెలలో వర్షాలు మొహం చాటేయడంతో వేరుశనగ పంట దిగుబడులు దారుణంగా దెబ్బతిన్నాయి.

 కిష్టిపాడులో ‘జీరో’... పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో చేపట్టిన పంట కోత ప్రయోగాల్లో పంట దిగుబడులు ‘జీరో’ వచ్చాయి. అంటే చెట్టుకు ఒక్క కాయ కూడా లేని దయనీయ పరిస్థితి. వ్యవసాయ, ప్రణాళికశాఖ అధికారులు ఇప్పటివరకు డి.హిరేహాల్, ముదిగుబ్బ, కనేకల్లు, రాయదుర్గం, గుంతక ల్లు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పామిడి, బెళుగుప్ప, పుట్లూరు, యల్లనూరు మండలాల పరిధిలో గుర్తించిన సర్వే నెంబర్ పోలాల్లో 5ఁ5 విస్తీర్ణంలో 30 పంట కోత ప్రయోగాలు పూర్తీ చేశారు.

దాదాపు అన్ని చోట్ల పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. కిష్టిపాడు గ్రామంలో జీరో రాగా... తాడిపత్రి మండలం పెద్దపొలమడ గ్రామంలో 30 గ్రాములు, 80 గ్రాములు, పామిడి మండలం రామరాజుపల్లిలో 20 గ్రాములు, 50 గ్రాములు, యాడికి మండలం నగరూరులో 50 గ్రాములు, 53 గ్రాములు, తాడిపత్రి మండలం ఆలూరులో 30 గ్రాములు మేర దిగుబడులు వచ్చాయి. అంటే ఇక్కడ ఎకరాకు అర బస్తా వేరుశనగ దక్కే పరిస్థితి కనిపించడం లేదు.

అలాగే పుట్లూరు, శింగనమల, పామిడి మండలం అనుంపల్లి, గుత్తి మండలం వెంకటంపల్లి, యల్లనూరు  మండలం కల్లూరు, నార్పల తదితర మండలాల్లో 150 గ్రాముల నుంచి 800 గ్రాముల వరకు దిగుబడులు వచ్చాయి. అంటే ఎకరాకు కాస్త అటుఇటుగా 40 కిలోలు కలిగిన ఒక బస్తా వేరుశనగ రావచ్చని చెబుతున్నారు. ముదిగుబ్బ, కనేకల్లు, పెద్దవడుగూరు, పుట్లూరు మండలాల్లో ఒకట్రెండు గ్రామాల్లో మాత్రమే 1.500 కిలో నుంచి 2.200 కిలోల దిగుబడులు వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.

అంటే ఎకరాకు సగటున మూడు బస్తాలు దిగుబడులు రావచ్చని చెబుతున్నారు. ముదిగుబ్బ మండలంలో ఒక సర్వే నెంబర్ పొలంలో మాత్రం అత్యధికంగా 3.400 కిలోలు వచ్చాయి. అంతకు మించి మరెక్కడా వేరుశనగ పంట దిగుబడులు ఆశాజానకంగా కనిపించడం లేదు. పంట కోత ప్రయోగాలు ఇంకా 350 వరకు చేపట్టాల్సి వుండటంతో సగటు దిగుబడులు చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు.

ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఈ ఏడాది ఎకరాకు ఒక క్వింటా సగటు దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక్కో పంట కోత ప్రయోగంలో 4 కిలోల దిగుబడులు వస్తేకాని పెట్టుబడులు దక్కే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది వేరుశనగ రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కించుకోలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడులు లెక్కిస్తే దాదాపు రూ.1,250 కోట్లు ఖర్చు చేశారు. దిగుబడులను పరిగణలోకి తీసుకుంటే ఎంతలేదన్నా రూ.2,500 కోట్లు కోల్పోతున్నారు.  

మరిన్ని వార్తలు