సీఆర్‌పీఎఫ్‌ పహారాలో ‘సాగర్‌’

2 Dec, 2023 03:47 IST|Sakshi

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ‘స్టేటస్‌ కో’.. నేడు ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారుల భేటీ

కృష్ణా బోర్డుకు నిర్వహణ బాధ్యతలు.. 

కేంద్ర ప్రతిపాదనకు అంగీకరించిన ఇద్దరు సీఎస్‌లు.. నవంబర్‌ 30 నాటి పరిస్థితి పరిగణలోకి తీసుకోవాలన్న ఏపీ సీఎస్‌

28కి ముందు పరిస్థితిని లెక్కలోకి తీసుకోవాలన్న తెలంగాణ సీఎస్‌

నాలుగు జిల్లాల దాహార్తి తీరుస్తూ కుడి కాలువ రెండు గేట్ల నుంచి రెండో రోజూ నీటి విడుదలను కొనసాగించిన ఏపీ 

సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి యథాస్థితి (స్టేటస్‌ కో) కొనసాగిస్తూ సీఆర్‌పీఎఫ్‌ దళాల పహారాలో ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామన్న కేంద్ర హోంశాఖ ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే నవంబర్‌ 30 నాటి పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి స్పష్టం చేయగా గత నెల 28కి ముందున్న పరిస్థితిని లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు.

కాగా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఏమాత్రం రాజీ లేకుండా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల దాహార్తి తీర్చేలా తాగునీటి అవసరాల కోసం రెండో రోజు శుక్రవారం కూడా 3,300 క్యూసెక్కుల నీటి విడుదలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోని నాగార్జునసాగర్‌ సగం స్పిల్‌వే, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఏపీ ప్రభుత్వం గురువారం స్వాధీనం చేసుకుని కుడి కాలువకు నీటిని విడుదల చేయడంపై తెలంగాణ సర్కార్‌ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది.

ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ బల్లా శుక్రవారం ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పెషల్‌ డైరెక్టర్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌లతో కలిసి రెండు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ­హించారు. జల్‌ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్, కృష్ణా బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌ కుశ్వీందర్‌సింగ్‌ వోరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. 

హక్కులు కాపాడుకోవడానికే..
తాము శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం 500 మంది పోలీసులను పంపి సాగర్‌లో సగం స్పిల్‌ వే, కుడి కాలువ హెడ్‌ రెగ్యు­లేటర్‌ను స్వాధీనం చేసుకుని ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేసిందని తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి పేర్కొన్నారు. దీనివల్ల ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి అతిక్రమణలకు పాల్ప­డడం ఇది రెండోసారి అని చెప్పారు. సాగర్‌ కుడి కాలువకు నీటిని తరలించడం వల్ల హైదరాబాద్‌ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో రెండు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు.

దీనిపై ఏపీ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో అక్టోబర్‌ 6న కృష్ణా బోర్డు 30 టీఎంసీలు కేటాయిస్తే అదే రోజు అక్రమంగా ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్‌కు తెలంగాణ సర్కారు నీటిని తరలించిందని ప్రస్తావించారు. దీనివల్ల శ్రీశైలంలో తమకు కేటాయించిన నీటిలో 17 టీఎంసీలను  కోల్పోవాల్సి వచ్చిందన్నారు.

తమ రాష్ట్రానికి నీటిని విడుదల చేసే సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ ఏపీ భూభాగంలోనే ఉన్నా దాన్ని తెలంగాణ తన అధీనంలోకి తీసుకుని నీటిని విడుదల చేయకుండా హక్కులను హరిస్తోంద­న్నారు. తమ  హక్కులను కాపాడుకోవడానికే సాగర్‌ స్పిల్‌ వేలో సగం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నామని తేల్చి చెప్పారు. 

తెలంగాణ సర్కార్‌ తీరుతో వివాదాలు
కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశామని కేంద్ర జల్‌ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్‌ సమావేశంలో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించగా తెలంగాణ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటోందని,  ఇప్పుడు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని కోరుతోందని ప్రస్తావించారు. 

తెలంగాణ సర్కార్‌ చర్యల వల్లే గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలులో జాప్యం జరుగుతోందని,  దీనివల్లే వివాదాలు ఉత్పన్నమవుతున్నాయని తేల్చి చెప్పారు. తాను శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వెళ్తే తెలంగాణ సర్కార్‌ తనను ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలోకి అనుమతించలేదని వెల్లడించారు. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ తెలంగాణ సర్కార్‌ కృష్ణా జలాలను వాడుకుంటోందని, ఇదే వివాదానికి కారణమవుతోందని ఆనంద్‌మోహన్‌ స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. 

తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు..
సాగర్‌ డ్యామ్‌పై విధులు నిర్వహిస్తున్న ఏపీ జలవనరుల శాఖ, పోలీసు సిబ్బందిని అడ్డుకున్న ఘటనకు సంబంధించి తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌)పై రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై పల్నాడు జిల్లా విజయపురి సౌత్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి కేసులు నమోదు చేశారు.

కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చర్చలు
రెండు రాష్ట్రాల సీఎస్‌ల వాదనలు, కేంద్ర జల్‌ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి, కృష్ణా బోర్డు ఛైర్మన్‌ అభిప్రాయాలను విన్న తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ బల్లా దీనిపై స్పందించారు. ఈనెల 3న తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ సాగర్‌పై స్టేటస్‌ కో కొన­సాగుతుందని ప్రకటించారు. ఈలోగా ఈ వివా­దంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్న­తాధికారులతో కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం సమావేశం నిర్వ­హి­స్తారని చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు రాష్ట్రాలతో సమగ్రంగా చర్చించి వివాదాన్ని పరిష్కరిస్తామని, అప్ప­టిదాకా సంయమనం పాటించాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు దిశానిర్దేశం చేశారు. 

కొనసాగుతున్న నీటి విడుదల
రెండో రోజు సాగర్‌ కుడికాలువ ద్వారా 3,300 క్యూసెక్కులు దిగువకు
సాక్షి, నరసరావుపేట, మాచర్ల, విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ భూభాగంలో ఉన్న 13 క్రస్ట్‌గేట్లు, హెడ్‌ రెగ్యు­లేటర్‌ను స్వాధీనపర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం నీటి హక్కులపై రాజీలేని పోరాటాన్ని కొనసా­గిస్తోంది. సాగర్‌ కుడికాలువ రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కుల నీటి విడుదల రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది.

పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం 5వ గేటు నుంచి 2,000 క్యూ­సెక్కులు, 2వ గేటు నుంచి 1,300ల క్యూసెక్కుల విడుదలను కొనసాగిస్తూ ఇరిగేషన్, పోలీసు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. సాగర్‌ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి నేతృత్వంలో సుమారు 1,300 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజ్, బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌ బందోబస్తును పరిశీలించారు. 

మరిన్ని వార్తలు