పాణమున్నా.. బొమ్మే!

13 Jul, 2014 02:47 IST|Sakshi

 విధి వెక్కిరించింది. ఆ కుటుంబం వెన్ను విరిచింది. రెక్కలొచ్చిన కొడుకు.. తన రెక్కల కష్టంతో తన పేద కుటుంబాన్ని కొంతైనా ఆదుకోవాలని భావిస్తే.. అతన్ని రెక్కలు విరిచి జీవచ్ఛవాన్ని చేసింది. మంచానికి కట్టి పడేసింది. లారీ రూపంలో విధి జరిపిన దాడిలో చెట్టంత కొడుకు మృత్యుముఖంలోకి వెళ్లాడు. తల్లడిల్లిన తల్లిదండ్రులు దాతల కరుణతో కొడుకు ప్రాణాలు నిలపగలిగారు గానీ.. అతన్ని మంచం నుంచి దించలేకపోయారు. లక్షల రూపాయలు పెట్టి చికిత్స చేయించడం తమ తలకు మించిన పని అని రోదిస్తున్నారు.
 
 పాలకొండ రూరల్: 2014, జనవరి 12.. ఓ కుర్రాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో ఒక లారీ భూతంలా దూసుకొచ్చి అతని పైనుంచి వెళ్లిపోయింది. అంతే పనికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆ కుర్రాడు ఆస్పత్రిపాలయ్యాడు. దాంతో ఆ కుటుంబం కష్టాలు ప్రారంభమయ్యాయి. పాలకొండ పట్టణం గురువుగారి వీధికి చెందిన సోమరిపేట దుర్గారావుది నిరుపేద కుటుంబం. కులవృత్తిపైనే ఆధారపడిన ఆయన రెక్కల కష్టంతో కొడుకు శివప్రసాద్‌ను ఉన్నత చదువులు చెప్పించాలన్న లక్ష్యంతో డిగ్రీ వరకు చదివించాడు. ఇంతకాలం తన చదువు కోసం అష్టకష్టాలు పడిన తండ్రికి కొంతైన చేదోడువాదోడుగా ఉందామన్న ఉద్దేశంతో శివప్రసాద్ మరింత ఉన్నత చదువులకు ప్రయత్నిస్తూనే స్థానిక బట్టల షాపులో పనిలో చేరాడు. తానొకటి తలస్తే.. దైవం మరొకటి తలచినట్లు.. జనవరి 12న పని చేస్తున్న దుకాణానికి వెళుతున్న అతన్ని వెనుక నుంచి వచ్చిన లారీ పైనుంచి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో పడిన కొడుకును రక్షించికోవడానికి తల్లిదండ్రులు నానా అవస్థలు పడ్డారు. దాతల సాయంతో లక్ష రూపాయలకుపైగా వైద్య చికిత్సలకు ఖర్చు చేసి ప్రాణాలు నిలబెట్టగలిగారు.
 
 మంచం మీదే అన్నీ..
 ప్రాణమైతే దక్కింది గానీ.. లేచి నిలబడ లేక, నడవలేక శివ జీవచ్ఛావంలా మారాడు. మంచానికే పరిమితమయ్యాడు. ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు కొన్ని నెలలుగా మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం వెన్ను విరిగినట్టయింది. చికిత్సకు ఇప్పటికే దాతల సాయంతోపాటు చేతిలో ఉన్న డబ్బంతా కరిగిపోయింది. కదలలేని స్థితిలో ఉన్న కొడుక్కి సపర్యలతో పాటు అన్ని అవసరాలు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వారు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. శివను తిరిగి ఆరోగ్యవంతుడిగా నిలబెట్టడానికి అవసరమైన చికిత్స కోసం వైద్యులను ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, దానికి రూ.6 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వారు చెబ్బడంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. కులవృత్తి, కూలి పనులు చేస్తే తప్ప కడుపు నిండని స్థితిలో అంత సొమ్ము ఎక్కడి నుంచి తేగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగని కొడుకు దుస్థితి చూడలేక కన్నీరుమున్నీరవుతున్నారు. మనస్సున్న మారాజులు స్పందించి ఆర్థికంగా చేయూతనిస్తే కొడుకు జీవితంతోపాటు.. తమ కుటుంబాన్ని నిలబెట్టినవారవుతారని ఆశగా ప్రార్థిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు