‘ట్విటర్‌లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత ఆయనది’

28 Sep, 2019 13:26 IST|Sakshi

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ధ్వజం

సాక్షి, తాడేపల్లి: ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయ్యారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు లక్ష్మిపార్వతి తెలిపారు. శనివారం ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి బాటలోనే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అవినీతి రహిత పాలన చేస్తున్నారని తెలిపారు.  నాలుగు నెలల పాలనలో సుమారు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత సీఎం జగన్‌ది అని ప్రశంసించారు. సీఎం జగన్‌ నిజాయతీ పాలన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ఐదేళ్లలో కమిషన్ల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

‘పీపీఏ, రాజధాని, పొలవరం అన్నింటిలో బాబు పాలన ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగి కుంభకోణాల మయంగా మారింది. ట్విటర్‌లో మాత్రమే మాట్లాడే కొడుకు కన్న ఘనత చంద్రబాబుదే. అవినీతి, దోపిడికి పాల్పడిన బాబుకు జగన్‌ పాలనను విమర్శించే హక్కు లేదు. పీపీఏలో భారీగా చంద్రబాబు కమిషన్లు తీసుకున్నారు. చివరికి కోడెల మృతదేహాన్ని పట్టుకొని శవ రాజకీయం చేశారు. చంద్రబాబు, కోడెల కుటుంబ సభ్యలు వల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఎల్లో మీడియా ఇష్టానుసారంగా వార్తలు రాస్తోంది. మహిళ అని చూడకుండా నాపై తప్పుడు వార్తలు రాశారు. టీడీపీ పాలనలో ప్రజా ధనాన్ని జన్మభూమి కమిటీలు దోచుకుతిన్నాయని’ ఆమె మండిపడ్డారు. తల్లుల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్‌ నాలుగు నెలల పాలనపై ఎటువంటి రీమార్క్‌ లేదని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం వైపు ఆయన అడుగులు వేస్తున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు