తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్‌

2 Dec, 2023 18:38 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారి రేపటికి(ఆదివారం) తుపానుగా మారే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

మిచాంగ్‌ తుపానుగా నామకరణం చేసిన ఈ తుపాను.. ఈ నెల 4వ తేదీన ఏపీలోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులంతా సన్నద్ధంగా ఉండాలన్నారు సీఎం జగన్‌. ఈ మేరకు తుపాను పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం జగన్‌. ‘తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి. సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలి.

కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలి.రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి’ అని  సీఎం జగన్‌ ఆదేశించారు.

ఎనిమిది జిల్లాలకు నిధులు విడుదల చేసింది సీఎం జగన్‌ ప్రభుత్వం.  తిరుపతి జిల్లాకు రూ. 2 కోట్ల నిధులు,  నెల్లూరు, ప్రకాశం. బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ. 1 కోటి చొప్పున నిధులు విడుదల చేశారు. 

చదవండి: దూసుకొస్తున్న ‘మిచాంగ్‌’ తుపాను.. ఐఎండీ రెడ్ అలర్ట్‌

మరిన్ని వార్తలు