నీరాజనం.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం

25 Nov, 2018 12:58 IST|Sakshi

ఘన స్వాగతం పలికి కష్టాలు చెప్పుకున్న అన్ని వర్గాల ప్రజలు 

జననేతపై హత్యాయత్నంతో తల్లడిల్లిన జిల్లా ప్రజానీకం 

36 రోజుల్లో 311.5 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర 

తొమ్మిది నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు పోటెత్తిన జనం 

పార్టీలో భారీగా చేరికలు.. శ్రేణుల్లో కదనోత్సాహం 

నేటితో జిల్లాలో పాదయాత్ర పూర్తి.. శ్రీకాకుళంలో ప్రవేశం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర జన జాతరలా సాగింది. అడుగడుగునా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. కష్టాలు చెప్పుకున్నారు. బహిరంగ సభలకు గిరిపుత్రులు భారీగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఎదురైన కష్టాలను ఏకరువుపెట్టారు. జననేతకు వస్తున్న ఆదరణకు జడిసి ఏకంగా ఆయనపై హత్యాయత్నం చేయడం చూసి విలవిల్లాడిపోయారు.
‘ఎవరెన్ని కుట్రలు పన్నినా మీకేం కాదు.. మీతోనే మంచి రోజులు వస్తున్నాయని నమ్ముతున్నాం.. మళ్లీ రాజన్న పాలన మీతోనే సాధ్యం.. ఎన్ని కష్టాలెదురైనా మేమంతా మీ బాటలోనే నడుస్తాం’ అని స్పష్టీకరించారు.
ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి విజయనగరం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో సెప్టెంబర్‌ 24న ప్రవేశించిన పాదయాత్ర నేటితో ముగియనుంది. అభిమానుల జయ జయ ధ్వానాల నడుమ 36 రోజుల పాటు 311.5 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో జననేత వేసిన ఒక్కో అడుగు ఒక చరిత్రగా నిలిచింది.

తొలిరోజు ఎస్‌కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలంలో 3000 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. ఇందుకు గుర్తుగా దేశపాత్రునిపాలెంలో జననేత ప్రత్యేక పైలాన్‌ను ఆవిష్కరించారు. అదే రోజున కొత్తవలసలో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. విజయనగరంలో జనం కనుచూపు మేర జననేత అడుగులో అడుగు వేశారు.

పైడితల్లమ్మవారి రెండు జాతరలు ఒకేసారి వచ్చినట్లుగా భారీ సంఖ్యలో జననేత సభకు హాజరయ్యారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, ఆ పార్టీ మహిళా మోర్చా నాయకురాలు రమణితో పాటు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ సభ్యత్వం స్వీకరించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం శాసససభకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని అక్కడి సభలోనే అధినేత ప్రకటించారు.

నెల్లిమర్ల మండల కేంద్రంలోని మొయిద జంక్షన్‌ వద్ద సభ జరుగుతుండగా ఓ ఆటో వచ్చింది. అందులో గర్భిణి ఉండటాన్ని గమనించిన జగన్‌.. తన ప్రసంగాన్ని నిలిపివేసి ఆటోకు దారివ్వాలని కార్యకర్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో ఆమె సకాలంలో ఆస్పత్రికి చేరగలిగింది. 


పార్వతీపురంలో పోటెత్తిన ప్రజాభిమానం
పార్వతీపురం నియోజకవర్గంలో ఇసుక వేస్తే రాలనంతగా జనం పాదయాత్రకు పోటెత్తడంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ  కిటకిటలాడాయి. పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభకు ఒడిశా ప్రాంతం నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. కురుపాం నియోజకవర్గంలో ప్రవేశించిన రోజు పాదయాత్ర 300 రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో భాగంగా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కట్టపై జననేత నడక సాగించారు.   

మరిన్ని వార్తలు