కొనసాగుతున్న ఉద్రిక్తత

31 Oct, 2018 07:35 IST|Sakshi
ఆందోళన చేస్తున్న రాములు అభిమానులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు

పొగోటి రాములు పార్క్‌లో టీడీపీ నేతల విగ్రహాల ఏర్పాటుకు మరోసారి ప్రయత్నం

అడ్డుకున్న పాగోటి అభిమానులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు

శ్రీకాకుళం, నరసన్నపేట: స్థానిక శర్వాణీ విద్యాలయం సమీపంలో ఉన్న పాగోటి రాములు బస్‌షెల్టర్‌ ఆనుకొని చిల్డ్రన్స్‌ పార్కు వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకొంది. ఎన్‌టీఆర్, కె.ఎర్రన్నాయుడు విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా రాములు అభిమానులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. రెండు వర్గాలను పోలీసులు సంమయయనంతో నచ్చజెప్పి పంపడంతో వాతావరణం చల్లబడింది. రాములు పేరున నిర్మించిన బస్‌ షెల్టర్‌కు ఆనుకొని ఉన్న చిల్డ్రన్‌ పార్క్‌లో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తుండటం, ఆదివారం రాత్రి ఈ పనులను రాములు అభిమానులు విరగ్గొటడం తెలిసిందే.

మంగళవారం ఉదయం పోలీస్‌ బందోబస్తు మధ్య టీడీపీ నాయకులు పనులు కొనసాగించగా రాములు భార్త ముద్దమ్మ, బంధువులు, అభిమానులు పార్క్‌ స్థలంలో ఎలా విగ్రహాలు నిర్మిస్తారని నిలదీశారు. వీరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. తన భర్త స్మారకార్థం కుమారులు రూ.15 లక్షలు వెచ్చించి పార్క్, బస్‌ షెల్టర్‌ నిర్మిస్తే ఇక్కడే టీడీపీ నాయకుల విగ్రహాలు పెట్టడమేంటని నిలదీశారు. ఎన్‌టీఆర్, ఎర్రన్నాయుడులు ఇప్పటి వరకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వివాదాలు సృష్టిం చేందుకు ప్రయత్నించ వద్దని కోరారు. అలాగే అనుమతులు లేకుండా విగ్రహాలు పెట్టడం పట్ల వీరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో పరి స్థితి చేయి దాటుతుందని గమనించిన పోలీసులు రెండు వర్గాలను నచ్చజెప్పి పంపించారు.

విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన
చిల్డ్రన్‌ పార్క్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించామని, అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వైఎస్సార్‌ సీపీ నాయకులు ధర్మాన రామలింగన్నాయుడు, కృష్ణచైతన్య, చింతు రామారావు, ఆరంగి మురళీ తెలిపారు. ఈమేరకు పార్క్‌ వద్ద విగ్రహం ఏర్పాట్లకు వీలుగా స్థలాన్ని పరిశీలించి, స్థానిక సీఐ శ్రీనివాసరావుతో మాట్లాడారు. విగ్రహాల పేరిట వివాదాలు సృష్టించవద్దని పోలీసులను కోరారు. కాగా దౌర్జన్యంగా విగ్రహాలు పెట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో దీనిని అధికారికంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సోమవారం నుంచీ ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీకి చెందిన  కొందరు అధికారులు రెండు రోజులుగా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే మంగళవారం 144 సెక్షన్‌ అమలు కోసం పోలీసులు తహసీల్దార్‌ రామారావు ను కోరారు. అయితే ఆయన విజయవాడ వెల్లడం ఆయన స్థానంలో మరోక అధికారికి డిప్యుటేషన్‌ ఇవ్వక పోవడంతో 144 సెక్షన్‌కు అనుమతులు రాలేదని తెలుస్తోంది.

కొనసాగుతున్న బందోబస్తు
మంగళవారం ఉదయానికే ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలు, పదుల సంఖ్యలో పోలీసులు నరసన్నపేట చిల్డ్రన్స్‌ పార్కు వద్ద మోహరించా రు. శ్రీకాకుళం నుంచి ప్రత్యేక దళాన్ని కూడా తీసుకువచ్చారు. అయితే రెండు వర్గాలు శాంతి యుతంగా ఉండటంతో కొద్ది ఉద్రిక్తత అనంతరం వాతవరణం చల్లబడింది. బస్‌స్టాప్, పార్క్‌ల వద్ద మాత్రం పోలీసు పహారా కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు