‘ఏపీలో సంక్షేమ పాలన.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు’

17 Nov, 2023 17:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లుగా అన్నీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేదలకు భూమి హక్కులు కల్పించిన నాయకుడు సీఎం జగన్‌. గత టీడీపీ ప్రభుత్వం పేదలను పట్టించుకుందా?’’ అని ప్రశ్నించారు.

సీఎం జగన్‌ రైతుల పక్షపాతి. ఆయన సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు ఏరోజైనా వెనుకబడిన వర్గాలను పట్టించుకున్నారా?. సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దే. చంద్రబాబు ఎన్ని హామీలిచ్చారు? ఎన్ని అమలు చేశారు?. అంబేద్కర్‌ ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు జగన్‌’’ మంత్రి పేర్కొన్నారు.

‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దళితులను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు వైఎస్‌ జగన్‌. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు కనీసం సొంతిల్లు కూడా లేదు. రాష్ట్రంలో ఉండని వ్యక్తులు ప్రజలకు ఇంకేం న్యాయం చేస్తారు’’ అంటూ మంత్రి మేరుగు నాగార్జున దుయ్యబట్టారు.
చదవండి: బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి 

మరిన్ని వార్తలు