లేపాక్షి ఉత్సవాలు మళ్లీ వాయిదా

2 Mar, 2018 08:37 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌

మార్చి 31, ఏప్రిల్‌ 1న నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడి

లేపాక్షి: లేపాక్షి ఉత్సవాలు మరోసారి వాయిదా పడ్డాయి. మార్చి 9, 10 తేదీల్లో నిర్వహించాల్సిన ఉత్సవాలను సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 31, ఏప్రిల్‌ 1వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. గురువారం లేపాక్షికి విచ్చేసిన ఆయన..స్థానిక ఏపీ టూరిజం అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాల విజయవంతానికి అంద రూ కృషి చేయాలన్నారు. అలాగే జిల్లాలో చెరువులన్నింటినీ హంద్రీనీవా కాలువ ద్వారా నీరునింపి సాగు, తాగునీరు  అం దించేందుకు ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు.

అయితే ఇందుకు రైతులు కూడా సహకరించాలన్నారు. ఒకరిద్దరు రైతులు తమ పరిహారం కోసం కోర్టుకు వెళ్లడంతో పనులకు బ్రేక్‌ పడుతోందన్నారు. హంద్రీనీవా కాలువలు ద్వారా నీరు ఇచ్చిన తర్వాతే ఉత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ సూచించారన్నారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం రీజినల్‌ డైరెక్టర్‌ గోపాల్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రామ్మూర్తితో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అయితే తొలుత ఫిబ్రవరి 23, 24న లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత మార్చి 9,10 తేదీలకు వాయిదా వేశారు. అయితే తాజాగా కలెక్టర్‌ మరోసారి వాయిదా వేయడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.

మరిన్ని వార్తలు