టీఆర్టీపై తర్జనభర్జన!

11 Oct, 2023 04:10 IST|Sakshi

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో నిర్వహణపై సందిగ్ధత

వాయిదా వేయక తప్పేలా లేదంటున్న అధికార వర్గాలు

హోరాహోరీ ప్రచార సమయంలో టీఆర్టీ పరీక్షలు.. తెరపైకి శాంతిభద్రతలు, ఇతరత్రా సమస్యలు

వాయిదా వేయాలంటూ అందుతున్న విజ్ఞప్తులు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ  నియామక పరీక్ష (టీఆర్టీ) వాయిదా వేయక తప్పేట్టు లేదని అధికార వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటమే దీనికి కారణమని పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకూ టీఆర్టీ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారు చేశారు.  పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఆరు రోజుల పాటు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగు తోంది. ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో పరీక్ష నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి.

పరీక్ష నిర్వహణ కష్టమేనా?
రాష్ట్రంలో ఎన్నికల హీట్‌ పెరుగుతోంది. వచ్చే నెల 30న ఎన్నికలుండటంతో 15 రోజుల ముందు నుంచే పోలింగ్‌ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తారు. అప్పటికి ఎన్నికల ప్రచారం హోరాహోరీ దశకు చేరుతుంది. దాదాపుగా ఇదే సమయంలో నవంబర్‌ 22న స్కూల్‌ అసిస్టెంట్లు, 23న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు, 24న భాషా పండితులు, 25 నుంచి 30వ తేదీ వరకూ సెకండరీ గ్రేడ్‌ టీచర్ల పోస్టులకు సంబంధించిన టీఆర్టీ జరగాల్సి ఉంది.

ఈ పరిస్థితుల్లో పోలింగ్‌ జరిగే 30వ తేదీ పరీక్షను వాయిదా వేస్తే సరిపోతుందని అధికారులు భావించినా, 20వ తేదీ నుంచే ఎన్నికల హడావుడి ఉంటుందని, అభ్యర్థులు కూడా ఓటు వేసేందుకు తమ ఊళ్ళకు వెళ్ళాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు భద్రతతో పాటు ఇతర శాంతిభద్రతల అంశాన్నీ, ఆంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని పలువురు విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

అదీగాక ఎన్నికల విధులకు వెళ్ళేందుకు టీచర్లు, ఇతర సిబ్బంది సన్నాహాల్లో ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పరీక్ష నిర్వహణ కష్టమని అధికార వర్గాలూ భావిస్తున్నాయి. దీంతో మొత్తంగా పరీక్షనే వాయిదా వేయడమా? ఎస్జీటీ పరీక్ష జరిగే 25 నుంచి 30వ తేదీల్లో మార్పు తేవడమా? అనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించి, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఒకటీ రెండురోజుల్లో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే వీలుందని అన్నారు. 

నెల రోజులు వాయిదా వేయండి
ఎన్నికల హడావుడిలో టీఆర్టీ పరీక్ష నిర్వహణకు ఇబ్బందు లెదురయ్యే అవకాశం ఉంది. నవంబర్‌ 20 నుండి 30 వరకు జరగబోయే ఈ పరీక్షలన్నీ నెల రోజులు వాయిదా వేయాలి. పరీక్ష దరఖాస్తు తేదీని కూడా పొడిగించాలి. – రావుల రామ్మోహన్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు