408 మద్యం షాపులకు లెసైన్స్

29 Jun, 2014 01:55 IST|Sakshi
408 మద్యం షాపులకు లెసైన్స్

- 154 షాపులకు దరఖాస్తులు నిల్
- 80 షాపులకు ఒకే ఒక్క దరఖాస్తు
- దరఖాస్తు రుసుం ద్వారా రూ. 14.89 కోట్ల ఆదాయం
 కాకినాడ క్రైం : జిల్లాలో 562 మద్యం షాపులకు గాను 408 షాపులకు మాత్రమే లెసైన్స్‌లు మంజూరయ్యాయి. లక్కీడిప్ ద్వారా వ్యాపారులకు ఈ షాపులను కేటాయించారు. జిల్లాలో 555 మద్యంషాపులు ఉండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం డివిజన్‌లోని 7 షాపులు కొత్తగా చేరాయి. దాంతో వీటి సంఖ్య 562కు చేరింది. 154 షాపులకు దరఖాస్తులేవీ అందలేదు.  

రెండేళ్ల క్రితం జారీ చేసిన మద్యంషాపుల లెసైన్స్‌ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో కొత్తగా లెసైన్స్‌ల మంజూరుకు ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. గతసారి 555 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 434 షాపులకు 4500 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ దఫా 562 షాపులకుగాను 408 షాపులకు మాత్రమే 5,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాజమండ్రి డివిజన్‌లో 96 షాపులకు 1,654, కాకినాడ డివిజన్‌లో 149 షాపులకు 2,563, అమలాపురం డివిజన్‌లో 163 షాపులకు 1,740 దరఖాస్తులు అందాయి. కాకినాడ నార్త్ స్టేషన్ పరిధిలోని ఒక షాపునకు అత్యధికంగా 117 దరఖాస్తులు వచ్చాయి. రాజమండ్రి డివిజన్‌లో15 షాపులకు, కాకినాడ డివిజన్‌లో 23 షాపులకు, అమలాపురం డివిజన్‌లో 42 షాపులకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయి.

భద్రాచలంలోని ఏడు షాపులకు గాను రెండు షాపులకు మాత్రమే దరఖాస్తులు అందాయి. మిగిలిన 154 షాపులకు మరోమారు దరఖాస్తులు ఆహ్వానించవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కేవలం మద్యంషాపుల దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ. 14.89 కోట్ల ఆదాయం లభించింది.
 
లక్కీడిప్ ద్వారా కేటాయింపు
మద్యం షాపుల లెసైన్స్‌లను లక్కీడిప్ ద్వారా వ్యాపారులకు కేటాయించారు. కాకినాడ అంబేద్కర్ భవన్‌లో భారీ ఏర్పాట్ల మధ్య  శనివారం డీఆర్‌ఓ బి. యాదగిరి రాజమండ్రి డివిజన్‌లోని షాపులకు లక్కీ డ్రా తీశారు. అలాగే కాకినాడ డివిజన్‌కు కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్, అమలాపురం డివిజన్‌కు జెడ్పీ సీఈఓ భగవాన్ లక్కీడిప్ తీశారు. లక్కీ డిప్‌లో షాపులు దక్కించుకున్న వారికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ లెసైన్స్‌లు అందజేశారు.
 
భారీ బందోబస్తు
జిల్లా నలుమూలల నుంచి సుమారు ఆరు వేల మంది వ్యాపారులు, వారి అనుచరులు కాకినాడ అంబేద్కర్ భవన్‌కు చేరుకోవడంతో డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్టాండు సెంటర్ నుంచి వార్ఫు రోడ్డు మీదుగా ట్రాఫిక్ మళ్లించారు.

మరిన్ని వార్తలు