పీఎం విశ్వకర్మ పథకానికి 1.4 లక్షల దరఖాస్తులు

28 Sep, 2023 06:02 IST|Sakshi

న్యూఢిల్లీ: పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ ఈ నెల 17న ప్రారంభించగా, పది రోజుల్లోనే 1.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) మంత్రి నారాయణ్‌ రాణే తెలిపారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం పథకం విజయానికి నిదర్శనమన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విశ్వకర్మ సోదరులు, సోదరీమణుల సమగ్రాభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.

కోల్పోయిన వారి గుర్తింపు తిరిగి పూర్వపు స్థతికి చేరుకుంటుందన్నారు. చేతి పనివారి సామర్థ్యాన్ని పెంచడం, వారి ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కు తీసుకెళ్లడం ఈ పథ కం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ పథకం కింద 18 విభాగాల చేతివృత్తుల పనివారు, కళాకారులు ప్రయోజనం పొందుతారని చెప్పారు. వీరికి ఈ పథకం కింద శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణాకాలంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫెండ్‌ కూడా లభిస్తుందన్నారు. టూల్‌కిట్స్‌ కొనుగోలుకు రూ. 15,000 అందజేస్తామన్నారు. లబి్ధదారులు హామీ లేని రూ.3 లక్షల రుణానికి అర్హులని చెప్పారు. 

మరిన్ని వార్తలు