నేటి నుంచి విజయవాడలో నిషేధాజ్ఞలు అమలు

16 Apr, 2020 09:04 IST|Sakshi

మహారాష్ట్ర నుంచి వారం రోజుల క్రితం నగరానికి వచ్చిన లారీ డ్రైవర్‌ 

అతని తల్లికి ఆరోగ్య పరీక్షలు.. పాజిటివ్‌గా నిర్ధారణ

బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించిన అధికారులు

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌): విజయవాడ సింగ్‌నగర్‌ ప్రాంతంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు బుధవారం వెలుగులోకి వచ్చింది. సింగ్‌నగర్‌ గంగానమ్మగుడి సమీపంలో నివసిస్తున్న లారీ డ్రైవర్‌ కొంతకాలం క్రితం మహారాష్ట్ర వెళ్లి వారం రోజుల క్రితం అదే లారీలో నగరానికి చేరుకొని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. వార్డ్‌ వాలంటీర్లు వివరాలు తెలుసుకునేందుకు వారి ఇంటికి వెళ్లినా విషయం చెప్పకుండా గోప్యంగా ఉంచాడు. అయితే రెండు రోజుల నుంచి లారీ డ్రైవర్‌ తల్లికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమె చుట్టుపక్కల ఉన్న హాస్పటల్స్‌కు వైద్య సేవలు కోసం వెళ్లగా అనుమానం వచ్చిన వారు గవర్నమెంట్‌ హాస్పటల్‌లో చూపించుకోమని సలహా ఇవ్వడంతో రెండు రోజుల క్రితం ప్రభుత్వ హాస్పటల్‌కు వెళ్లి టెస్ట్‌లు చేయించుకుంది.

అయితే బుధవారం ఆమెకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ ఉన్నట్లుగా రిపోర్టులు రావడంతో అధికార యంత్రాంగం అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వివరాలు విచారించగా ఆమె తన కొడుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన విషయాన్ని తెలిపింది. దీంతో పోలీసు, కార్పొరేషన్‌ అధికారులు ఆ నివాస చుట్టుపక్కల ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా మార్చారు. లారీ డ్రైవర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను వైద్య పరీక్షలకు తరలించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్, మలేరియా ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌ ఆయా చుట్టుపక్కల ప్రాంతమంతా బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్‌లను ముమ్మరంగా పిచికారీ చేయించి చర్యలు తీసుకున్నారు.  

అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు : జేసీ డాక్టర్‌ మాధవీలత 
సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్‌): జిల్లాలో నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిత్యావసర వస్తువుల ధరల నిర్ణయాక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వర్తక, వాణిజ్య వ్యాపార వర్గాలతో నిత్యావసర వస్తువుల ధరలపై జాయింట్‌ కలెక్టర్‌ సమీక్షించారు. జేసీ మాధవీలత మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ డీఎం కె.రాజ్యలక్షి్మ, మార్కెటింగ్‌ శాఖ డీడీ ఎం.దివాకరరావు, డీఎస్‌ఓ మోహన్‌బాబు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు విద్యాధరరావు, ఆయిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లయ్య, కిరాణా అసోసియేషన్‌ అధ్యక్షుడు రామారావు పాల్గొన్నారు. 
కళాశాలలకు 

మే 3 వరకు సెలవులు
మచిలీపట్నం: కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలు, పీజీ సెంటర్లుకు మే 3వ తేదీ వరకు సెలవులు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ కె.కృష్ణారెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పొడిగించినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా బుధ వారం సర్క్యులర్‌ జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

నేటి నుంచి విజయవాడలో నిషేధాజ్ఞలు అమలు
భవానీపురం(విజయవాడ): విజయవాడ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గురువారం నుంచి సెక్షన్‌ 144 (2) సీఆర్‌పీసీ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నిషేదాజ్ఞలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి మే నెల 31వ తేదీ వరకు అమలులో ఉండే ఈ నిషేదాజ్ఞల సమయంలో నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఐదుగురు లేదా అంతకు మించి ఎక్కువ మంది జనం గుమికూడరాదని తెలిపారు. కర్రలు, రాళ్లు వంట వాటిని పట్టుకుని తిరగకూడదన్నారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కూచిపూడి క్వారంటైన్‌కు 13మంది తరలింపు
కూచిపూడి(మొవ్వ): మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని రవి ప్రకాష్‌ సిలికానాంధ్ర హాస్పటల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని బుధవారం తీసుకువచ్చినట్లు మొవ్వ మండల వైద్యాధికారి డాక్టర్‌ శొంటి శివ రామకృష్ణారావు తెలిపారు. వీరు పామర్రు నియోజకవర్గ పరిధిలోని పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి చెందిన వారని తెలిపారు. ఈ కుటుంబంతో సంబంధం కలిగిన ఓ యువకుడు ఢిల్లీ నుంచి రావటం, విజయవాడలో ఉంటున్న ఈ యువకుడికి ఈ నెల 13వ తేదీన  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరగటం, ఈ నెల 4వ తేదీ వరకు ఆ యువకుడి తల్లి విజయవాడలో ఉండి, పింఛన్‌ కోసం బుధవారం యలమర్రు వచ్చినట్లు తెలిపారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కుటుంబాన్ని  క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు