ప్రేమను పెద్దలు కాదన్నారని...

13 Mar, 2015 02:19 IST|Sakshi

 ఏలూరు (వన్ టౌన్) :తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు మృతిచెందగా ఒక యువతి పరిస్థితి విషమంగా ఉంది. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాలలో జరిగిన ఈ ఘటనలపై బాధితులు, వారి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
 
 పెద్దలు నిరాకరించారని..
 కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో నివాసం ఉండే వై వెంకటేశు(23) గ్రామంలోనే ఉంటూ తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. అదే గ్రామంలో నివాసం ఉండే మూలం శైలజ ఇంటర్ పూర్తి చేసి గ్రామంలోనే ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలోని వేబ్రిడ్జిలో పనిచేస్తోంది. శైలజ తండ్రి ఊరూరా తిరిగి నవారు అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం నుంచి వెంకటేశు, శైలజలు ప్రేమించుకుంటున్నారు. శైలజకు వెంకటేశు వరసకు బావ అవుతాడు. ప్రేమించుకునే క్రమంలో పలుమార్లు వీరి ప్రేమ విషయం పెద్దల దగ్గర ప్రస్తావించారు. అయితే కట్నం కావాలని పెద్దలు కోరడంతో పెళ్లి వ్యవహారం కొన్నాళ్లు మరుగున పడింది.
 
 ఈ నేపథ్యంలో గురువారం వెంకటేశు కుటుంబ సభ్యులను నిలదీయడంతో కట్నం లేనిదే పెళ్లి కుదరదని తెగేసి చెప్పేశారు. దీంతో విసిగిపోయిన యువకుడు ప్రియురాలికి ఫోన్ చేసి ఇక మనపెళ్లి జరగదు వీళ్లు జరగనిచ్చేలా లేరు నువులేని జీవితం నాకెందుకు నేను చచ్చిపోతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తరువాత కొద్దిసేపటికే మళ్లీ ఫోన్ చేసి నేను వెళ్లిపోతున్నాను. నువ్వైనా సుఖంగా జీవించు. పురుగు మందు తాగేశాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో యువతి కూడా వేబ్రిడ్జి కార్యాలయంలో ఉన్న సల్ఫర్ తాగేసింది. వెంకటేశును బంధువులు ఆటోలో, యువతిని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. తడికలపూడి ఎస్సై కె.గురవయ్య కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 పెళ్లైన వ్యక్తితో వివాహం ఏమిటని పెద్దలు మందలించారని..
 జంగారెడ్డిగూడెం కొత్తపేట ఇందిరాకాలనీలో నివాసం ఉండే నగరపు సింహాద్రి, అప్పాయమ్మలు ఎనిమిది సంవత్సరాల క్రితం ఉపాధి కోసం విజయనగరం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అప్పటి నుంచి కూలీపనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలలో శిరీష (19) ఆఖరి సంతానం. హైస్కూల్ వరకూ చదువుకుని తరువాత మానేసి ఇంటివద్దనే ఉంటోంది. కాలనీలో నివాసం ఉండే సూరిబాబు అనే తాపీమేస్త్రీతో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. అయితే సూరిబాబు పది నెలల క్రితం వేరే పెళ్లి చేసుకున్నాడు. తనకు అతనితోనే పెళ్లి జరిపించాలని యువతి పట్టుబట్టింది.
 
 తల్లిదండ్రులు.. అతనికి పెళ్లైపోయింది నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి అతనితో పెళ్లి వద్దూ అని పలుమార్లు చెప్పి చూశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఏమైందో ఏమో తెలీదు కానీ తల్లిదండ్రులు పనికి వెళ్లాక యువతి తాడుతో ఇంట్లోనే ఉరి వేసుకోగా స్థానికులు చూసి జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులను సంప్రదించగా పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు తరలించాలని చెప్పడంతో అక్కడి నుంచి ఏలూరు తీసుకెళ్లారు. అక్కడ యువతిని పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం చేశారు. ఈమె సాయంత్రం సమయంలో మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.  జంగారెడ్డిగూడెం ఎస్సై కె.శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు