‘పవర్’ పాలిటిక్స్!

21 Mar, 2016 01:34 IST|Sakshi
‘పవర్’ పాలిటిక్స్!

ప్రారంభానికి నోచని లాల్‌పురం విద్యుత్ సబ్‌స్టేషన్
మంత్రి, ఎంపీపీల మధ్య విభేదాలే కారణం
లోఓల్టేజ్‌తో ఇబ్బంది పడుతున్నఆరు గ్రామాల ప్రజలు

 
 ప్రజలకు సేవ చేస్తామని ప్రమాణం చేసి పదవుల్లో కూర్చుంటున్న పెద్దలు పంతాలతో జనానికి సమస్యగా మారుతున్నారు. కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణాలు అక్కరకు రాక నిరుపయోగంగా మిగులుతున్నాయి.
 
సాక్షి, గుంటూరు : గుంటూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరుతో నలిగిపోతున్నారు. ఇక్కడ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎంపీపీ తోటా లక్ష్మీకుమారి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ విషయం లాల్‌పురం గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ విషయంలో కూడా తేటతెల్లమవుతోంది. విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి ఎంపీపీని పిలవ వద్దంటూ మంత్రి, మంత్రి వస్తే తాను రానంటూ ఎంపీపీ భీష్మించుకుని కూర్చోవడంతో ఏం చేయాలో తెలియక విద్యుత్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఎనిమిది నెలలు గడుస్తున్నా...
లాల్‌పురం గ్రామ పంచాయతీ పరిధిలో 2015 ఫిబ్రవరి 5వ తేదీ రూ.2 కోట్ల వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎంపీపీ తోటా లక్ష్మీకుమారి శంకుస్థాపన నిర్వహించారు. నాలుగు నెలల్లో నిర్మాణం కూడా పూర్తయింది. అయితే ఈలోపు మంత్రి, ఎంపీపీ మధ్య వివాదాలు తారస్థాయికి చేరడంతో తాము చెప్పిందే జరగాలని పంతాలకు దిగుతున్నారు. విద్యుత్ ఉప కేంద్రంలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టును తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ ఇద్దరు పట్టుబట్టడంతో ఏమి చేయాలో తెలియక విద్యుత్ శాఖ అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో విద్యుత్ ఉప కేంద్రం పూర్తయి ఏడెనిమిది నెలలు గడుస్తున్నా ప్రారంభోత్సవం జరుపకుండా వదిలేశారు.

ఆరు గ్రామాల సమస్య...
విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభమైతే లోఓల్టేజీ సమస్య తీరుతుందని ఆశించిన గుంటూరు రూరల్ మండలంలోని ఆరు గ్రామాల ప్రజలకు ప్రజాప్రతినిధుల పోరు శాపంగా మారింది. లాలుపురం, పొత్తూరు, లింగాయపాలెం, అంకిరెడ్డిపాలెం, బుడంపాడు, నాయుడుపేట గ్రామాల్లో ఈ సబ్‌స్టేషన్ ద్వారా లోఓల్టేజీ సమస్య తీరనుంది. లాల్‌పురం చుట్టుపక్కల సుమారు 30 కోల్డ్ స్టోరేజీలు, మరికొన్ని పరిశ్రమలకు సైతం ఈ విద్యుత్ ఉపకేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది.

అయితే సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయినా నిరుపయోగంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు పంతాలకు పోయి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి, ఎంపీపీ తమ వివాదాలు పక్కన పెట్టి ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించి నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు