ఏం.. తమాషాలు చేస్తున్నారా?

21 Mar, 2016 01:34 IST|Sakshi
ఏం.. తమాషాలు చేస్తున్నారా?

♦ ఆర్థిక శాఖ అధికారిపై సీఎం చంద్రబాబు శివాలు
♦ కాంట్రాక్టర్ల బిల్లులపై కొర్రీలు వేయడం పట్ల అసహనం
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘ఏం.. పిచ్చిపిచ్చిగా ఉందా? తమాషాలు చేస్తున్నారా? ప్రతి ఫైల్‌లో ఇష్టానుసారంగా రాస్తారా.. ఇలాగైతే పరిపాలన ఎలా చేయాలి?’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారిపై నోరుపారేసుకున్నారు.ఆ అధికారి చేసిన తప్పల్లా... బడ్జెట్‌లో కేటాయింపులు లేని బిల్లులను చెల్లించేందుకు నిరాకరించడమే. ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా సీఎం చెప్పిన వారికి దోచిపెట్టేందుకు  అధికారులు సిద్ధంగా లేరు. కాంట్రాక్టర్లకు బిల్లులను ఇష్టారాజ్యంగా చెల్లించేందుకు ఆర్థికశాఖ విముఖత వ్యక్తం చేస్తోంది.ఇది చంద్రబాబుకు రుచించడం లేదు. పోలవరం, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల ఫైళ్లకు ఇద్దరు సీఎస్‌లు అడ్డుతగలడంతో ఆయన రగిలిపోతున్నారు.

 బిల్లులు వస్తేనే ‘ముఖ్య’ నేతకు కమీషన్లు
 ఆర్థిక సంవత్సరం త్వరలో ముగియనుంది. కాంట్రాక్టర్లతోపాటు అన్ని శాఖలకు బిల్లుల చెల్లింపులను ఆర్థికశాఖ నిలిపివేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే గానీ ‘ముఖ్య’ నేతకు కమీషన్లు ముట్టవు. ఈ నేపథ్యంలో శనివారం ఆర్థిక శాఖ అధికారిని సీఎం తన కార్యాలయానికి పిలిపించుకున్నారు.ఆ అధికారిని చూడగానే తిట్ల దండకం అందుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం తీరు చూసిన ఆయన కార్యాలయ ఉన్నతాధికారి కూడా కంగుతిన్నారు. ఇక ఆర్థిక శాఖ అధికారికైతే నోట మాట రాలేదు.

 ఇబ్బందులొస్తే ఎవరు జవాబుదారీ?
 ఆర్థిక సంవత్సరం త్వరలో ముగియనుండడంతో పనులకు సంబంధించిన బిల్లులను ఆలోగా పొందాలని కాంట్రాక్టర్లు ఆత్రుత పడుతున్నారు. బడ్జెట్ కేటాయింపులు లేని బిల్లులను చెల్లించేందుకు ఆర్థిక శాఖ ససేమిరా అంటోంది. కాంట్రాక్టర్లు ఈ విషయాన్ని సీఎం చెవిన వేయడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సాగునీటి శాఖ ఫైళ్లను ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించిన నేపథ్యంలో పలు శాఖల ఉన్నతాధికారులూ నిబంధనల మేరకే ఫైళ్లను ఆమోదిస్తున్నారు. నిబంధనలను సడలించుకోవాల్సి ఉంటే ఆ పని ముఖ్యమంత్రి చేసుకోవాలని, అలా కాకుండా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఫలితం ఉండదనే భావన ఉన్నతాధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు