మాచవరం మగధీర

21 Apr, 2018 11:07 IST|Sakshi
గుర్రపు స్వారీ చేస్తున్న శ్రీధర్‌

ఎనిమిదేళ్ల వయస్సు నుంచే గుర్రపు స్వారీ

అశ్వశిక్షణలో ఆరితేరిన అంగర శ్రీధర్‌

రాయవరం (మండపేట) : రాజకుమారుడు గుర్రంపై స్వారీ చేస్తాడని అవ్వాతాతలు కథల్లో చెబుతుంటారు. ఆ మాటలు వింటుంటేనే పిల్లలకు ఎంతో ఉత్తేజం కలుగుతుంది. తామూ గుర్రమెక్కి దౌడు తీస్తున్నట్టు ఊహించుకుంటారు. అలాగే సినిమాల్లో తెరమీద హీరోహీరోయిన్లు గుర్రపు స్వారీ చేస్తుంటే..వారి స్థానంలో తామే స్వారీ చేస్తున్నట్టు భావించి, థ్రిల్లవుతుంటారు.  అలాంటిది ఓ పిలగాడు.. ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే గుర్రపు స్వారీ చేస్తూ.. ఎందరికో కలగా ఉండే సరదాను నిత్యకృత్యంగా ఆస్వాదించాడు.  ఒకనాటి ఆ బాలుడే  రాయవరం మండలం మాచవరానికి చెందిన అంగర శ్రీధర్‌.

ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే..

మాచవరంలో గుర్రపు స్వారీకి కొవ్వూరి వెంకటరెడ్డి(డాబారెడ్డి) పేరు పొందారు. ఆయన చిన్నప్పటి నుంచే గుర్రాలను పెంచడం  హాబీగా చేసుకున్నారు. ఆ ఊరికే చెందిన శ్రీధర్‌ ఆయనను చూసి ఎనిమిదేళ్ల వయస్సు నుంచే గుర్రాలపై స్వారీ చేయడాన్ని అలవాటు చేసుకున్నాడు. గుర్రపు స్వారీపై ఉన్న ఆసక్తితో దాంతో పాటు  గత 10 సంవత్సరాలుగా గుర్రాన్ని నియంత్రించడం, దానికి శిక్షణ ఇవ్వడం నేర్చుకున్నాడు. ఇప్పుడు గుర్రాలకు శిక్షణ ఇవ్వడాన్నే ప్రవృత్తిగా స్వీకరించాడు. తనకు అప్పగించిన గుర్రాలను దౌడు తీయించడం,  సంజ్ఞల ద్వారా వాటితో కాళ్లు పైకి లేపించడం, సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్‌ చేయించడం వంటి శిక్షణ ఇస్తున్నాడు.

ఇంతవరకూ 15 గుర్రాలకు శిక్షణ..

ఇప్పటి వరకు 15 గుర్రాలకు శిక్షణ ఇచ్చానని శ్రీధర్‌ ‘సాక్షి’కి తెలిపాడు. రాజమహేంద్రవరం, కైకవోలు, పెద్దాపురం తదితర గ్రామాల నుంచి గుర్రాలను శిక్షణ నిమిత్తం తెచ్చారని, గుర్రాలపై ఉన్న మమకారంతో ఎటువంటి ఫీజు తీసుకోకుండానే శిక్షణ ఇస్తున్నానని తెలిపాడు. చిన్న వయస్సు నుంచే గుర్రాన్ని నియంత్రించడం,  స్వారీ చేయడం వలన ఎటువంటి గుర్రాన్నైనా లొంగదీసుకునే చాకచక్యం, శక్తి అలవాటయ్యాయన్నాడు. తాను ప్రత్యేకించి మూడు గుర్రాలను సాకుతున్నానన్నాడు.  

మరిన్ని వార్తలు