రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న టీడీపీ

4 Nov, 2018 06:17 IST|Sakshi

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో ఎలా జతకడతారు 

విజయవాడ సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

జగన్‌పై హత్యాయత్నం ముమ్మాటికీ టీడీపీ కుట్రే

ప్రభుత్వంపై నమ్మకం లేకనే థర్డ్‌ పార్టీ విచారణ 

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి

తణుకు: ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికా రాన్ని హస్తగతం చేసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకుందని విజయవాడ సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాది విష్ణు విమర్శించారు. శనివారం తణుకులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ తొలిసంతకం పెడతానందని, అందుకే ఆ పార్టీతో కలిశామని రాజకీయ నాటకం ఆడుతున్న చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారానికి సిద్ధ పడ్డారని ఎద్దేవా చేశారు. సేవ్‌ నేషన్‌ పేరుతో కాంగ్రెస్‌తో కలవాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నేను, మోడీ జోడీ ఇద్దరం అనుభవజ్ఞులం అంటూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తామని ప్రజల్ని చంద్రబాబు నమ్మించి ఓట్లు వేయించుకున్నారని అన్నారు.

 మమ్మిల్ని గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని, విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాలు ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. 2014 ఎన్నికలయ్యాక ఆర్నెల్లలోపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించాక నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు ఎలా కలిసి ప్రయాణం చేశారని ప్రశ్నించారు. రెండు నెలల క్రితం రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తే.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రం కడుపు కొట్టిందని, రాహుల్‌ను అడుగు పెట్టనివ్వొద్దని చెప్పిన చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీయే అన్నారని చెప్పారు. గతంలో గుంటూరు సభలో పాల్గొనేందుకు రాహుల్‌గాంధీ వస్తే పోలీసులను పెట్టి అడుగడుగునా విజయవాడ నుంచి గుంటూరు  వరకు నల్లజెండాలు చూపించి చంద్రబాబు అలజడి సృష్టించారన్నారు.

 ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రాహుల్‌గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీ రామారావు లక్ష్యాలు, సిద్ధాంతాలను టీడీపీ తుంగలో తొక్కిందన్నారు. ఇప్పుడు సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పా రు. ఒకపక్క రాష్ట్రం కరువుతో అల్లాడిపోతూ, లోటు వర్షపాతంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్పందించని చంద్రబాబు తమ పార్టీ నాయకులపై ఐటీ దాడులు జరుగుతుంటే మాత్రం స్పందిస్తున్నారన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కేంద్రంతో లాలూచీ పడకుండా తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాసం పెట్టించిందన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ స్వలాభాల కోసం చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. నిన్న మొన్నటి వరకు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ అని వైఎస్సార్‌ సీపీపై బురద జల్లి ఇప్పుడు ఆ పార్టీతో రాజకీయ ఒప్పందం చేసుకున్నారని దుయ్యబట్టారు. 2019లో ఏకపక్షంగా ఒంటరిగా జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్రంలో పోటీ చేస్తుందన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలకే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టలేదన్నారు.

పక్కా ప్రణాళికతోనే జగన్‌పై హత్యాయత్నం
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. ఘటన జరిగిన అరగంటలోనే డీజీపీ ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రచారం కోసమే జరిగిందని.. మంత్రులు, సీఎం సైతం దాడి చేసింది ఆయన అభిమాని అని నమ్మించే ప్రయత్నం చేయడం వెనుక కుట్ర బహిర్గతమవుతోందన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత, 42 శాతం ఓటు బ్యాంకు కలిగి ఉండి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్‌పై దాడి జరిగితే దాన్ని చిన్నవిషయంగా కొట్టిపారేయడానికి ప్రభుత్వం ఆడిన నాటకం అంతా ఇంతా కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకుని మట్లాడిన తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో స్వయం ప్రతిపత్తి కలిగిన థర్ట్‌ పార్టీ సంస్థతో విచారణ చేపట్టాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. నిందితుడు శ్రీనివాసరావును వారం పాటు పోలీసు కస్టడీకి తీసుకుని ఇప్పుడు అతనిచేత ఎలాంటి విషయాలు రాబట్టలేకపోయామని అటు పోలీసులు, ఇటు సిట్‌ అధికారులు చేతులెత్తేయడం రాష్ట్రప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనమన్నారు. పార్టీ రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు, పార్టీ నాయకులు కోనూరు సతీష్, టీవీకే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు