వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరతా

5 Jul, 2017 01:53 IST|Sakshi
వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరతా
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. అనుచరులతో కలసి జగన్‌తో భేటీ
 
సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కాంగ్రెస్‌ నేత మల్లాది విష్ణు తాను వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆయన పెద్ద సంఖ్యలో తన అనుచరుల తో కలసి వచ్చి మంగళవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. జగన్‌తో కొద్దిసేపు చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ అరాచకపు పాలనను సాగిస్తోందని... ఈ పరిస్థితుల్లో జగన్‌ సీఎం కావడం అనేది ఒక చారిత్రక అవసరమని చెప్పారు. తాను ఇవాళ జగన్‌ను కలిసి పార్టీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించాన న్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ను ఆశించి చేరుతున్నారా? అని ప్రశ్నించినపుడు... తాను జగన్‌తో అలాంటివేవీ చర్చించలేదన్నారు.

జగన్‌ నాయకత్వాన్ని బలపర్చే ఉద్దేశ్యంతోనే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో తనకు 1980 నుంచీ అనుబంధం ఉందనీ, ఆయన తనను ఎంతో ఆత్మీయంగా చూసేవారని చెప్పారు. ఇపుడు ఆయన తనయుడు జగన్‌ నాయకత్వం కింద పని చేయాలని పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని విజయవాడలో సభను ఏర్పాటు చేసి జగన్‌ సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరతానని చెప్పారు. జగన్‌తో విష్ణు భేటీ అయిన సందర్భంగా పీఏసీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ ఇతర నేతలు హాజరయ్యారు. 
 
కాంగ్రెస్‌కు విష్ణు గుడ్‌బై
విజయవాడ సెంట్రల్‌: విజయవాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లాది విష్ణు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డికి మంగళవారం రాజీనామా లేఖను పంపారు. దాన్ని పరిశీలించిన ఆయన వెంటనే ఆమోదించారు. విష్ణు 1980 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగా, ఉడా చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా గతంలో పలు బాధ్యతలు చేపట్టారు. గడిచిన మూడేళ్లుగా విజయవాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలపై ముమ్మరంగా పోరాటాలు నిర్వహించారు. తనను ఇన్నేళ్ళు ఆదరించినందుకు కాంగ్రెస్‌ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.
 
వంగవీటి రంగాకు నివాళులర్పించిన జగన్‌
సాక్షి, హైదరాబాద్‌: వంగవీటి రంగా జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన రంగా చిత్రపటానికి వైఎస్‌ జగన్‌ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.