చూసినాడు.. చేసే నేడు

14 Nov, 2019 10:11 IST|Sakshi
మనబడి నాడు–నేడు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానున్న సిద్ధాంతం జెడ్పీ పాఠశాలలో ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం

మన బడి నాడు–నేడు ప్రారంభం 

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం  

తొలివిడతలో 1,058 పాఠశాలల అభివృద్ధి  

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో ఆయన నాటి ప్రభుత్వం సర్కారీ బడులను మూసివేయడంతో పేద విద్యార్థుల అవస్థలను చూసి చలించారు. తాను అధికారంలోకి వస్తే కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని గురువారం బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నారు.

సాక్షి, పెనుగొండ: ప్రతి పేదవాడికి కార్పొరేటు స్థాయిలో నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని ప్రకటించిన ఆయన ఇప్పుడు సర్కారీ బడుల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం నుంచి మనబడి నాడు– నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో  ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని), స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత, కలెక్టరు రేవు ముత్యాల రాజు గురువారం పెనుగొండ మండలం  సిద్ధాంతంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.   

రూపు మారన్నున్న పాఠశాలల 
మనబడి నాడు– నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపు మారనుంది. జిల్లాలో 3,301 ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతలుగా కార్పొరేటు స్థాయి వసతులతో తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలివిడతలో 1,058 పాఠశాలలను ఆధునికీకరించనున్నారు. దీంతో మూడేళ్ల కాలంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేటు పాఠశాలలను తలపించేలా రూపాంతరం చెందనున్నాయి. దీనిలో భాగంగా ముందుగా ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మంచినీరు, మరుగుదొడ్లు, ప్రతి తరగతి గదిలోనూ ఫ్యాన్లు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, ఫరి్నచర్‌ కొనుగోలు, పాఠశాల సుందరీకరణ, ప్రహరీల నిర్మాణం, తరగతి గదుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులు అంచనాలు రూపొందించారు.

ఆరోగ్యంపైనా శ్రద్ధ 
కార్పొరేటు పాఠశాలలకు తీర్చిదిద్దడంతో పాటు విద్యార్ధుల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను, ముఖ్యంగా కంటిచూపుకు ఇబ్బంది లేనివిధంగా బ్లాక్‌ బోర్డులను తొలగించి వాటి స్థానే గ్రీన్‌బ్లాక్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.  దీంతో పాటు ప్రతి పాఠశాలలో ఇంగ్లిషు లైబ్రరీ ఏర్పాటు చేయడంతో పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టనున్నారు. 

నాణ్యమైన విద్య లక్ష్యం  
ప్రతి పేదవాడికీ నాణ్యమైన విద్య అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగానే మనబడి నాడు–నేడు కార్యక్రమం ప్రాంభిస్తున్నాం. గత ప్రభుత్వం సర్కారీ విద్యను నిర్లక్ష్యం చేసింది.  
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి 

ప్రభుత్వ పాఠశాలలకు వైభవం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలకు వైభవం రానుంది. వచ్చే ఐదేళ్లలో పాఠశాలలు బలోపేతం అవుతాయి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వ విద్యావ్యవస్థకు మంచి రోజులు వచ్చాయి. ఇది ఆనందించాల్సిన విషయం.  
– టి.టి.ఎఫ్‌.రూజ్‌వెల్ట్, సీఎంఓ, సమగ్ర సర్వశిక్ష 

నిబద్ధత చాటుకున్నారు 
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషితో ఇచ్చిన మాటకు కట్టుబడి నిబద్ధతను చాటుకున్నారు. మనబడి నేడు–నాడు కార్యక్రమం సిద్ధాంతంలో ప్రారంభింపచేస్తున్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు కృతజ్ఞతలు 
– కడలి రామనాగ గోవిందరాజు,  వైఎస్సార్‌ సీపీ  బీసీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా