బాబుది కుటిల రాజకీయం

15 Jan, 2015 04:18 IST|Sakshi
బాబుది కుటిల రాజకీయం

పాలకొండ :  ముఖ్యమంత్రి చంద్రబాబువి కుటిల రాజకీయమని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బుధవారం పాలకొండలోని ఓ కల్యాణ మండపంలో జిల్లాలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని ప్రకటించడంతో గత  ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చామన్నారు. ఎన్నికల సమయంలో మాలలంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపు ఉన్నారని, మాదిగల తరఫున ఆంధ్రాలో ప్రచారం చేయమని కోరితే ఆయన గెలుపు కోసం ప్రయత్నించామన్నారు. వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని ప్రకటించి ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేక శక్తులతో చేయి కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై అసెంబ్లీకి వెళ్లి కలిస్తే మాలలు ఎక్కువగా ఉన్నారు కదా అంటూ దాటవేసే ధోరణితో మాట్లాడారన్నారు.
 
 మంత్రులు కూడా చంద్రబాబు చేసిన ప్రకటనలను, ప్రవర్తిస్తున్న తీరును తన వద్దకు వచ్చి తప్పుబట్టారని తె లిపారు. ఇచ్చిన మాట నెరవేర్చకపోగా నమ్మించి మోసగించారని ధ్వజమెత్తారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపి సీట్లు ఇస్తానని ఎరవేసినా మాదిగ జాతి కోసం పదవులు త్యజించానన్నారు. ఇంతటి నయ వంచనకు పాల్పడిన చంద్రబాబుపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో త్వరలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ ద్వారా టీడీపీ పతనాన్ని శాసించాలన్నారు. ఆ పార్టీ పతనమే ధ్యేయంగా ఎంఆర్‌పీపఎస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మండంగి నాగరాజు, యందవ నారాయణమాదిగ, అలజంగి నాగభూషణ్‌మాదిగ, బోసు మన్మథరావుమాదిగ, కళింగ ప్రేమభూషణ్‌మాదిగ, సైల రామారావు, ఎస్.సింహాద్రి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు