‘నిద్రపోను.. అధికారులను నిద్రపోనివ్వను’

16 Jun, 2019 15:51 IST|Sakshi
మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి(పాత చిత్రం)

మంగళగిరి: గత ఐదేళ్లలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిథులకు ఏమాత్రం సహకరించలేదని, ఎమ్మెల్యేగా గెలిచిన తన విషయంలోనే అధికారులు ప్రోటోకాల్‌ పాటించలేదని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి తెలిపారు. ఆదివారం మంగళగిరి మండల పరిషత్ సమావేశంలో ఆళ్లరామక్రిష్ణారెడ్డి అధికారులతో మాట్లాడారు. అధికారులపై ఒత్తిడి తెస్తే మానసికంగా ఇబ్బంది పడతారేమోనని అప్పట్లో వదిలేశానని చెప్పారు. భగవంతుడు, ప్రజలు నన్ను ఆశీర్వదించి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు. మండల పరిషత్‌ సమావేశాలకు ఇకపై అన్నిశాఖల అధికారులు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు.

గైర్హాజరైన అధికారులపై చర్యలు తప్పవన్నారు. అధికారులు తప్పుడు సమాచారం చెబితే నమ్మే అంత పిచ్చి వాడినైతే తాను కాదన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. గత ఐదేళ్లలో ప్రజా ధనాన్ని లూటీ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ అధికారులు తమ ఉద్యోగాలకు న్యాయం చేయాలని విన్నవించారు. ప్రజాప్రతినిధులు పర్సంటేజీలు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల వద్ద నుంచి లంచాలు తీసుకోవద్దు.. ఒకవేళ ప్రజలు ఇచ్చినా దయచేసి తీసుకోవద్దని అధికారులకు సూచించారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అండగా నిలబడతామని  హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు