కులగణనకు అనుకూలమా.. వ్యతిరేకమా?

18 Nov, 2023 05:00 IST|Sakshi

పురందేశ్వరి సమాధానం చెప్పాలి

వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి డిమాండ్‌ 

సీపీఎం నేత రాఘవులు వ్యాఖ్యలపై ఆగ్రహం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అణగారినవర్గాల అభ్యున్నతి, మరింత మెరుగైన సామాజికన్యాయం కల్పించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన కులగణనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అనుకూలమా.. వ్యతిరేకమా.. అనే విషయం చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తాడేపల్లిలో ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమని పురందేశ్వరి పని చేస్తున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబు పాలసీనే తన విధానం అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఎస్సీ, బీసీ కులాలను కించపరుస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని, బీసీలు జడ్జీలుగా పనికిరారని, వారి తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ‘గత లోక్‌సభ ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు 20 పోలింగ్‌ బూత్‌లలో ఆమెకు ఒక్క ఓటు కూడా పడలేదు. మరో 40 బూత్‌లలో పదిలోపే ఓట్లు పడ్డాయి. అయినప్పటికీ ఆమె బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు.

అందరికీ అటువంటి అదృష్టం కలిసిరాదు..’అని ఆయన పేర్కొన్నారు. కాషాయ పార్టీకి నాయకత్వం వహిస్తూ, పచ్చ పార్టీకి కాపలా కాయడం పురందేశ్వరికి మాత్రమే చెల్లిందని దుయ్యబట్టారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌ ర్యాలీలో పచ్చ కండువాలు స్వైరవిహారం చేస్తున్నాయని, స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీ అపవిత్ర పొత్తులకు తెగించిందని స్పష్టమవుతోందని తెలిపారు.

టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని టోటల్‌ డ్రామాస్‌ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ తోకపార్టీల్లోనూ కుల పెత్తందారీ అహంకారం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇంగ్లీష్‌ మీడియం వల్ల ప్రయోజనం లేదని సీపీఎం నేత రాఘవులు చేసిన వ్యాఖ్యలు చూస్తే తోకపార్టీల్లోనూ కుల, పెత్తందారీ అహంకారం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు