వీళ్లెక్కడ ‘లోకల్‌’?

16 May, 2019 04:29 IST|Sakshi

కోచింగ్‌లు తీసుకుంటున్న ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్న పలువురు గ్రూప్‌–3 అభ్యర్థులు 

ఆ జిల్లాలనే పోస్ట్‌ ప్రిఫరెన్స్‌ జిల్లాగా పరిగణించిన ఏపీపీఎస్సీ

ఓపెన్‌ కేటగిరిలోని 20శాతం పోస్టులకే వారు అర్హులు 

సొంత జిల్లాలో పంచాయతీ సెక్రటరీ పోస్టులకు అవకాశం కోల్పోయిన వేలాదిమంది అభ్యర్థులు

ఏపీపీఎస్సీ చైర్మన్‌కు విన్నవించినా ఫలితంలేదని అభ్యర్థుల ఆందోళన

సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లాకు చెందిన అల్లూర్‌రెడ్డి 2016 పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్‌లో ఒకే ఒక్క మార్కు తేడాతో ఉద్యోగానికి దూరమయ్యాడు. గతేడాది ఏపీపీఎస్సీ 1051 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీనిలో ప్రకాశం జిల్లాలో ఎక్కువ పోస్టులుండటంతో ఈసారి ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకంతో మరింత కష్టపడి చదివి స్క్రీనింగ్‌ టెస్ట్‌లో మంచి మార్కులు సాధించాడు. అయితే కోచింగ్‌ తీసుకుంటున్న గుంటూరు జిల్లాలోనే పరీక్షలు రాయడానికి సౌకర్యంగా ఉంటుందని ఆ జిల్లాను ఎగ్జామినేషన్‌ సెంటర్‌గా ఎంపిక చేసుకున్నాడు. అయితే ఏపీపీఎస్సీ అల్లూర్‌రెడ్డిని గుంటూరు జిల్లా నాన్‌లోకల్‌ అభ్యర్థిగా పరిగణించింది. దీంతో సొంత జిల్లాలో ఎక్కువ పోస్టులున్నా అక్కడా అవకాశాన్ని కోల్పోయి తీవ్రంగా నష్టపోయానని ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు. ఇది అల్లూర్‌రెడ్డి ఒక్కడి సమస్యే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది గ్రూప్‌–3 అభ్యర్థులది. 

– ఓపెన్‌ కేటగిరిలో నాన్‌లోకల్‌గా..
ఏపీపీఎస్సీ 2018–19 పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో చాలా వరకూ అభ్యర్థులు లోకల్‌ జిల్లాగా తమ సొంత జిల్లాను, ఎగ్జామినేషన్‌ సెంటర్‌ కింద కోచింగ్‌ తీసుకుంటున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఎగ్జామినేషన్‌ సెంటర్‌ కింద ఎంపిక చేసుకున్న జిల్లానే పోస్ట్‌ ప్రిఫరెన్స్‌ జిల్లాగా ఏపీపీఎస్సీ పరిగణించడంతో చాలామంది ఆయా జిల్లాల్లో నాన్‌లోకల్‌ అభ్యర్థులుగా మారి.. నాన్‌లోకల్‌ కింద 20 శాతం పోస్టులకే అర్హులవుతున్నారు. సొంత జిల్లాల్లో ఎక్కువ పోస్టులున్నా వాటికి అర్హత కోల్పోయారు. ఎగ్జామినేషన్‌ సెంటర్‌ కోసం ఎంపిక చేసుకున్న జిల్లానే పోస్ట్‌ ప్రిఫరెన్స్‌ కింద పరిగణిస్తామని నోటిఫికేషన్‌లోనే పేర్కొన్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు. అయితే మార్చి 18 నుంచి 24 మధ్య ఎగ్జామినేషన్స్‌ సెంటర్స్‌ మార్చుకునే అవకాశం కల్పించినా ప్రిపరేషన్‌ హడావుడిలో అభ్యర్థులు పట్టించుకోలేదు. తీరా స్క్రీనింగ్‌ పరీక్ష పూర్తయ్యాక పొరపాటును గ్రహించి లబోదిబోమంటున్నారు. ఈ తరహా పొరపాటు చేసిన వారిలో అధిక శాతం అభ్యర్థులు ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారే. ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్థులు గుంటూరులో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు విశాఖపట్టణంలో ఎక్కువ శాతం కోచింగ్‌లు తీసుకుంటుంటారు. దీంతో ఆయా జిల్లాల అభ్యర్థులు తాము కోచింగ్‌ తీసుకుంటున్న ప్రాంతాలనే ఎగ్జామినేషన్‌ సెంటర్ల కింద ఎంపిక చేసుకున్నారు. 

– నోటిఫికేషన్‌లోనే చెప్పాం.. మా తప్పేం లేదు!
కోచింగ్‌ తీసుకుంటున్న జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఎంపిక చేసుకుని నాన్‌లోకల్‌ అభ్యర్థులుగా పరిగణించబడుతున్నవారు ఇప్పటికే పలుమార్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కలిసి వినతిపత్రాలిచ్చారు. దరఖాస్తులో లోకల్‌ జిల్లా కాలమ్‌లో ఎంపిక చేసుకున్న జిల్లానే తమ పోస్ట్‌ ప్రిఫరెన్స్‌ జిల్లాగా పరిగణించాలని విన్నవించుకున్నారు. 2016–17 గ్రూప్‌–3 నోటిఫికేషన్‌ సైతం ఈ తరహా సమస్య తలెత్తగా అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెయిన్స్‌ను తమ సొంత జిల్లాల్లో రాసుకునేలా వెసులుబాటు కల్పించి, అభ్యర్థుల సొంత జిల్లాలనే పోస్ట్‌ ప్రిఫరెన్స్‌ జిల్లాలుగా పరిగణించారు. అయితే ప్రస్తుత నోటిఫికేషన్‌లో అభ్యర్థులు పలుమార్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కలిసి సమస్య తెలియజేసినా.. ‘మేం నోటిఫికేషన్‌లో స్పష్టంగా చెప్పాం.. మా తప్పేం లేదు’.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు