పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పని సరి

6 Apr, 2016 00:42 IST|Sakshi
పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పని సరి

నిడమర్రు : వివాహానికి చట్టబద్ధత కల్పించడం కోసేమే రిజిస్ట్రేషన్. గతంలో పెళ్లి పత్రికలు, ఫొటోలు మాత్రమే వివాహాలకు ఆధారంగా ఉండేవి. అలాకాకుండా వివాహాలు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. జరిగిన వివాహాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ఇచ్చే పెళ్లి నమోదు పత్రం భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడనుంది.

ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టాన్ని 2002 మే లో రాష్ట్ర గవర్నర్ ఆమోదించగా 2006 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని కూలాలు, మతాలు, వర్గాలకు వర్తించనుంది. ఈ చట్టంలోని సెక్షన్ -8 ప్రకారం రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని స్పష్టం చేసింది. ఈ చట్టం అమలుకు రాష్ట్రస్థాయిలో వివాహాల రిజిస్ట్రార్ ఉంటారు. అన్ని జిల్లాలకు జిల్లా రిజిస్ట్రార్ ఉంటారు. వివాహాల రిజిస్ట్రార్ జనరల్‌కు లోబడి జిల్లాలో అమలు చేసే బాధ్యత సంబంధిత సబ్ రిజిస్ట్రార్లపైనే ఉంటుంది.

వివాహం నమోదు ఇలా..
వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు వధువు లేదా వరుడు ఇద్దరిలో ఎవరి తల్లితండ్రులు, సంరక్షకులైనా వివాహం నమోదు కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందించాలి.

దరఖాస్తులు వధూవరుల వయస్సు తెలియజేసే ధ్రువపత్రాలు మరియు ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు. వీటిని ఏదైనా గెజిటెడ్ అధికారితో ఎటాస్టడ్ చేయించుకోవాల్సి ఉంది. వీటితోపాటు  శుభలేక, ఒక ఫొటో, కల్యాణ మండపంలో జరిగితే అద్దె రసీదు, దేవాలయంలో జరిగితే ఫీజు రసీదులు జత చెయ్యాలి.

వధూవరులు తరుపున ముగ్గురు సాక్షులు రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు చెయ్యాల్సి ఉంటుంది. సాక్షుల ఆధార్ లేదా గుర్తింపు కార్డులు జత చెయ్యాలి.

రిజిస్ట్రార్ ఈ సమాచారాన్ని రిజిస్ట్రర్‌లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు.

పెళ్లి జరిగే ప్రదేశంలోను, మన ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివాహ నమోదు పత్రం (సర్టిఫికెట్)పై ధ్రువీకరణ అధికారి సంతకం సీలు వేసి దంపతులకు అందిస్తారు.

ఆ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రూ.210 ఫీజు చెల్లించి నమోదు చేసుకోవచ్చు. గతంలో ఏడాది దాటితే జిల్లా రిజిస్ట్రార్ అనుమతి కోసం పంపేవారమని నేడు స్థానిక సబ్ రిజిస్ట్రార్‌లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు గణపవరం సబ్ రిజిస్ట్రేషన్ అధికారి కె.వజ్రం తెలిపారు.

వివాహం ఎందుకు నమోదు చేసుకోవాలంటే..ఈ విధంగా నమోదు చేసుకుంటే జరిగిన వివాహానికి చట్టబద్ధత ఉంటుంది.

- కుటుంబానికి సంబంధించి ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేందుకు ఉపయోగపడుతుంది.

-భర్త నుంచి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు ఆధారంగా ఉపయోగపడుతుంది.

-వరకట్నం కేసులో నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా ఈ ధ్రువీకరణ పత్రం ఉపయోగపడుతుంది.

-విడాకులుకోరే భార్య లేదా భర్త  కూడా వివాహం జరిగినట్టు ఆధారం చూపించాల్సి ఉంటుంది.

-రెండవ వివాహాలను అడ్డుకోవాడనికి మహిళలు లేదా పురుషులకు ఇది ముఖ్యమైన సాక్షంగా ఉపయోగపడుతుంది.

తప్పుడు సమాచారానికి శిక్ష
వివాహ నమోదు పత్రంలో మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువైతే ఏడాది జైలు శిక్ష లేదా వెయ్యి జరిమానా, లేదా ఈ రెండు అమలు చేస్తారు.

- ఉద్దేశ పూర్వకరంగా అధికారి వివాహ నమోదు చెయ్యలేదని దరఖాస్తు దారుని ఫిర్యాదు రుజువైతే ఆఅధికారికి మూడు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా, లేదా రెండు శిక్షలు అమలు చేస్తారు.

మరిన్ని వార్తలు