ఎస్సీ, ఎస్టీలంటే చులకనా? | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలంటే చులకనా?

Published Wed, Apr 6 2016 12:39 AM

ఎస్సీ, ఎస్టీలంటే చులకనా? - Sakshi

♦ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
♦ పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
♦ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను విడుదల చేయరేం
♦ దళితులు, గిరిజనులను చిన్నచూపు చూస్తున్నారు
♦ జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమంలో జగన్
 
 సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల పట్ల చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ ఆ వర్గాలకు పాలకులు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. భారత మాజీ ఉప ప్రధాని, దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్‌కు మంగళవారం వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె నాలుగు రోడ్ల కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం బాబూ జగ్జీవన్‌రామ్ 109వ జయంతి కార్యక్రమంలో మాట్లాడారు.

‘‘చంద్రబాబు ఇప్పటికైనా మారాలని దేవుడిని గట్టిగా ప్రార్థిద్దాం. చంద్రబాబులో మార్పు వచ్చేదాకా ఆయనపై ఒత్తిడి తీసుకొద్దాం. ఈ విషయంలో అందరం కలసికట్టుగా ఒక్కటై పోరాడదాం. చంద్రబాబులో మార్పు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటగా మార్పు వచ్చే దిశగా అడుగులు వేయాలంటే.. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి. ఎందుకంటే ఈ కమిటీల్లో అధికార పార్టీ కార్యకర్తలను సభ్యులుగా నియమించారు. గ్రామాల్లో సర్పంచ్‌లకు విలువ లేదు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన సర్పంచ్ సంతకం పెట్టినా పెట్టకపోయినా జన్మభూమి కమిటీల్లోని సభ్యులు ఎవరికి సంతకాలు పెడితే వారికి మాత్రమే పింఛన్లు, ఇళ్లు, ఇతర ప్రయోజనాలు ఇస్తారట. మిగిలినవారికి ఇవ్వరట. కారణం.. మిగిలినవారు చంద్రబాబుకు ఓటు వేయలేదట. పాలకులు పేదల జీవితాలతో చెలగాటం అడుతున్నారు’’ అని ప్రతిపక్ష నేత నిప్పులు చెరిగారు.

 ఎస్సీ, ఎస్టీలకు సర్కారు మొండిచేయి
 బాబూ జగ్జీవన్‌రామ్, బీఆర్ అంబేడ్కర్ అట్టడుగు వర్గాలకు తోడుగా నిలబడ్డారు కాబట్టే ప్రజలు ఇప్పటికీ వారిని మర్చిపోలేకపోతున్నారని జగన్ చెప్పారు. రాష్ట్రంలో బలహీన వర్గాలు, అట్టడుగు కులాలకు తోడుగా ఉన్నామా? లేదా? అని పాలకులు గుండెలపై చేయి వేసుకొని ప్రశ్నించుకోవాలని సూచించారు. ఇదే అంశంపై తాము అసెంబ్లీలో కూడా మాట్లాడామని గుర్తుచేశారు. దళితులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దళితులంటే తీసేసినట్లుగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద దళితులు, గిరిజనులకు వారి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం మొండిచేయి చూపుతోందని ధ్వజమెత్తారు. దీన్నిబట్టి ఎస్సీ, ఎస్టీలపై పాలకులకు ఏమాత్రం ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

 అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించారు
 కడప కలెక్టరేట్‌లో ఆవిష్కరించడానికి అంబేడ్కర్ విగ్రహాన్ని తీసుకొస్తే దానిని అక్కడి నుంచి తొలగించారని జగన్ విమర్శించారు. పాలకుల వివక్షకు ఇంతకంటే నిదర్శనం మరొకటి అవసరం లేదన్నారు.  పాలకులకు బుద్ధొచ్చేలా అంతా ఒక్కటై పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి, అంబేద్కర్ సేవా సమితి చైర్మన్ రామాంజనేయులు,  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 చంద్రబాబుది ఫ్యూడల్ మనస్తత్వం
 ‘‘పేదవాడికి కులం లేదు, మతం లేదు. పేదవాడికి పార్టీలు లేవు. పేదవాడికి రాజకీయాలతో సంబంధం లేదు. అతడికి కావాల్సింది కడుపునిండా తిండి పెట్టే కార్యక్రమం, పెట్టే మంచి మనసున్న నాయకత్వం. చంద్రబాబు ప్రభుత్వం దళితులు, గిరిజనులను చిన్నచూపు చూస్తోంది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రకారం గిరిజన సలహా కమిటీని నియమించాల్సి ఉండగా.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ నియమించలేదు.

కారణం ఏమిటీ అంటే... ఈ కమిటీలో మూడొంతుల మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండాలి. రాష్ట్రంలో ఏడు ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఆరు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలిచారు. గిరిజన సలహా కమిటీని నియమిస్తే ఈ ఎమ్మెల్యేలు అందులో సభ్యులవుతారు. కాబట్టి కమిటీని నియమించకుండా చంద్రబాబు గిరిజనులకు ద్రోహం చేస్తున్నారు.ఆయనది ఫ్యూడల్ మనస్తత్వం. చంద్రబాబుకు ఎస్సీల పట్ల ఉన్న ద్వేషం ఇటీవలే బయటపడింది. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అంటూ దళితులను దిగజారుస్తూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం చాలా దారుణం’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.

Advertisement
Advertisement