ప్రశవ వేదన

3 Jul, 2015 00:25 IST|Sakshi
ప్రశవ వేదన

మన్యంలో ఆగని మాతా, శిశు మరణాలు
108లో మృతశిశువు జననం
రక్తహీనతతో ఆస్పత్రిలో కన్నుమూసిన తల్లి

 
పాడేరురూరల్/జి.మాడుగుల : ఏజెన్సీలో మాతా,శిశు మరణాలు ఆగడంలేదు. మన్యంలోని కొన్ని ఆస్పత్రుల్లో బర్త్‌వెయిటింగ్ రూంలను ఏర్పాటు చేసి గర్భిణులను కాన్పుల కోసం ముందుగా తీసుకురావడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ ఇది సక్రమంగా అమలు కావడం లేదు. ఇందుకు మరణాలే సాక్ష్యం. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి వెయ్యిమందిలో 40 మందికి పైగా పిల్లలు పుట్టిన తరువాత, ప్రతి లక్ష మంది గర్భిణుల్లో 137 మందిప్రసవ సమయంలో మృతి చెందుతున్నారు. మాత్రా,శిశు మరణాల్లో 50 మంది రక్తహీనతతోనే చనిపోతున్నారని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. మన్యంలో ఈ ప్రభావం మరీ ఎక్కువ. గురువారం మరో గర్భిణి ప్రసవ వేదనతో కన్నుమూసింది. జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ కంఠవరానికి చెందిన కొండపల్లి నాగరాత్నం(28)కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు రక్తహీనతకు గురైందని, పరిస్థితి విషమంగా ఉన్నందున పాడేరు లేదా విశాఖపట్నం తరలించాలని సూచించారు.

కానీ పీహెచ్‌సీలోనే ప్రసవానికి సేవలు అందించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. వైద్యులతో కొద్ది సేపు వాగ్వాదానికి దిగారు. చివరకు వైద్యులు కుటుంబసభ్యులను ఒప్పించి108లో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా పాడేరు-జి.మాడుగుల రహదారిలోని లాడాపుట్టు సమీపంలో అంబులెన్స్‌లోనే మృతశిశువును ప్రసవించింది. తీవ్ర రక్తస్రావానికి గురైంది. పాడేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా చనిపోయింది. కొద్ది గంటల వ్యవధిలోనే తల్లి, బిడ్డ మృతి చెందారు. నాగరత్నంకు ఇది ఐదో కాన్పు. కాగా గత నెల 24న స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఒక బాలింత రక్తహీనతతో చనిపోయింది. అంతకు ముందు ఏప్రిల్ 21న హుకుంపేట మండలం జరకొండ పంచాయతీ బురదగుమ్మిలో ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మృత్యువాత పడింది. రక్తహీనతతో కాన్పు కష్టమై గిరిజన మహిళలు చనిపోతున్న సంఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. గర్భిణుల ఆరోగ్య సేవలపై పర్యవేక్షణ కుంటుపడుతున్నాయనడానికి ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయి. ప్రతి అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణుల వివరాలు నమోదు చేస్తున్నారు. వారికి పౌష్టికాహారం, వైద్యసేవలు మొక్కుబడిగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో మాతా, శిశు సంరక్షణ పథకాలు సవ్యంగా అమలు కావడం లేదు.
 
 

మరిన్ని వార్తలు