జాతరకు సర్కారు సరుకు

27 Dec, 2013 02:36 IST|Sakshi
జాతరకు సర్కారు సరుకు

మేడారంలో ఏపీబీసీఎల్ దుకాణాలు
 =ధరలు, నాటుసారా నియంత్రణకు చర్యలు
 =ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు

 
సాక్షిప్రతినిధి, వరంగల్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. అధిక ధరలతో వ్యాపారుల దోపిడీని, నాటుసారాను నియంత్రించడం కోసం ప్రభుత్వ తరఫున ప్రత్యేకంగా దుకాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ జి.కిషన్ సమక్షంలో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయించారు. గిరిజనులకు ఇచ్చే లెసైన్స్ దుకాణాలకు తోడుగా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్(ఏపీబీసీఎల్)తో జాతరలో దుకాణాలు పెట్టించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ దుకాణాలు ఉంటేనే లెసైన్స్‌దారులు ధరలు అదుపులో ఉంచుతారని, దీని వల్ల జాతరలో నాటు సారా, నాసిరకం మద్యాన్ని నియంత్రించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. జాతరలో ఏపీబీసీఎల్ దుకాణాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో తుది నిర్ణయం జరిగిన తర్వాత అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది.

మేడారం జాతరలో ముఖ్యంగా ఉండేది మద్యం, మాంసమే. ఇవే జాతరలో వ్యాపారులకు పెద్ద ఆదాయ వనరులు. మద్యం అమ్మకాల్లో గరిష్ట చిల్లర అమ్మకం ధర(ఎంఆర్‌పీ) అనేది ఇక్కడ ఎవరికీ పట్టని విషయం. జాతరకు వచ్చిన వారి అవసరం, అమ్మకందారుల ఇష్టం ప్రాతిపదికగా ధరలు ఉంటాయి. ప్రస్తుతం రూ.75 ఎంఆర్‌పీ ఉన్న క్వార్టర్ బాటిల్ మేడారంలో ఇప్పుడే రూ.130 ఉంది. జాతర సమయంలో ఏకంగా రూ.200కు విక్రయిస్తారు. ఒక్కోసారి ఈ ధరకు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది.

ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణ ఎంత ఉన్నా ధరల నియంత్రణ సాధ్యంకాని అంశం. జాతర సమయంలో ఎంఆర్‌పీ ప్రకారమే తాడ్వాయి మండలం పరిధిలో సగటున కోటి రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతాయి. లెసైన్స్‌దారుల విక్రయించిన ప్రకారమైతే ఇది నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మేడారం జాతరలో గిరిజన సంస్థలు, గిరిజనులే మద్యం దుకాణాలను నిర్వహించాల్సి ఉంటుంది.

2012లో జరిగిన జాతర కోసం ఎక్సైజ్ శాఖ 22 దుకాణాలకు లెసైన్స్‌లు జారీ చేసింది. ఈ దుకాణాల కోసం ప్రతిరోజు రూ.6 వేల లెసైన్స్ ఫీజు వసూలు చేయగా, రూ.కోటి వరకు వ్యాపారం జరిగింది. వచ్చే జాతరలో ఇది రెండు కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీబీసీఎల్ తరఫున దుకాణాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే జాతరలో సర్కారు దుకాణాల ఏర్పాటు మాత్రం స్థానిక గిరిజనుల స్పందనపైనే ఆధారపడి ఉండనుంది.
 

మరిన్ని వార్తలు