ప్రైవేట్ ఆసుపత్రులపై దాడులు

24 Nov, 2016 03:30 IST|Sakshi
 తిరుపతి మెడికల్: వైద్య కేంద్రంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో జిల్లా వైద్యాధికారులు జరిపిన ఆకస్మిక దాడులు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. దాదాపు దశాబ్దం తర్వాత  ఇలా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అసోసియేషన్(అప్నా) సంయుక్త సహకారంతో జిల్లా వైద్యాధికారిణి దాడులు నిర్వహించారు. పాత నోట్లు చెల్లవని, చిల్లర ఉంటేనే వైద్యం అంటూ మెలిక పెడుతుండడంతో జిల్లా వ్యాప్తంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి దినపత్రికలో బుధవారం  ‘చిల్లర రోగానికి మందు లేదా’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది.  దీనిపై జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ త్రీవంగా స్పందించారు. జిల్లా వైద్యాధికారిణిని పిలిచి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల  తీరుపై విచారణ జరిపి, సమస్యను పరిష్కరించాలంటూ ఆదేశించారు. అందులో భాగంగానే ఆమె బుధవారం ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకధాటిగా పలు ప్రైవేటు ఆస్పత్రులపై దాడులు నిర్వహించారు.
 
 గుర్తింపు లేకున్నా ఆరోగ్యశ్రీ  వైద్యసేవలు
 రెడ్డి అండ్ రెడ్డి కాలనీతో పాటు నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో కార్పొరేట్,  ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారి తనిఖీలు చేశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ శ్రీహరిరావు, ప్రైవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిన్నారి వెంకటేశ్వర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర అధ్యక్షురాలు డాక్టర్ కృష్ణప్రశాంతితో కలసి దాదాపు 10 ఆసుపత్రులను తనిఖీ చేశారు. మోడల్ డయాగ్నోస్టిక్ సెంటర్, కళ్యాణ్ ఆర్థోపెడిక్, తిరుమల హాస్పిటల్, శ్రీమారుతి స్పెషాలిటీ, హీలియస్, శ్వేత ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఇందులో  మూడింటిలో రిజిస్ట్రేషన్ ఒక పేరుతో సేవలు మరో విధంగా అందిస్తుండడం, అసలు ఆసుపత్రికి గుర్తింపు లేకున్నా, ఆరోగ్యశ్రీ బోర్డు పెట్టుకుని వైద్య సేవలు అందిస్తుండడం వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా మరో ఆసుపత్రిలో అయితే గుర్తింపు లేకుండా ఏడాదిగా ఆఫర్ల పేరుతో వైద్యం అందిస్తూ వేలకు వేలు దండుకుంటున్నట్టు గుర్తించారు. ఈ ఆసుపత్రులన్నింటికి నోటీసులు జారీ చేశారు.
 
 పాతనోట్లు తీసుకోకుంటే కఠిన చర్యలు 
 చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి పాత నోట్లు తీసుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి స్వైపింగ్ మిషన్లను తెచ్చుకుని అందుబాటులో పెట్టుకోవాలని ఆస్పత్రి యాజమాన్యాలను ఆదేశించారు.  ఎవరైనా రూ.500, రూ.1000 నోట్లు తీసుకోకపోతే ఐఎంఏ, ఆప్నా వైద్యులను సంప్రదించాలని, లేకుంటే తన ఫోన్ నెంబరు 9849902373 కు ఫిర్యాదు చేయవచ్చునని కోరారు. 
 
మరిన్ని వార్తలు