సచివాలయ కంప్యూటర్‌లో మైక్రో కెమెరాలు

30 Oct, 2017 03:58 IST|Sakshi

బాత్రూమ్‌లలో తప్ప అన్ని చోట్లా మూడో కన్ను

ఆవేదన వ్యక్తం చేస్తున్న సచివాలయ సిబ్బంది

ఇదేమైనా ‘బిగ్‌బాస్‌’ షోనా అని మండిపాటు  

సాక్షి, అమరావతి: సచివాలయ అధికారులు, ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచింది. బాత్రూమ్‌లు మినహా కారిడార్లు, ఉద్యోగులు పనిచేసే క్యాబిన్లు, క్యాంటీన్లు.. చివరకు కంప్యూటర్లలో సైతం కెమెరాలు అమర్చారు. ఎటు కదిలినా కెమెరాలు వెంటాడుతుండటంతో సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తప్పులేదు గానీ.. తమను అవమానించేలా ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పెట్టడమేమిటని మండిపడుతున్నారు. కంప్యూటర్లలో సైతం మైక్రో కెమెరాలు ఏర్పాటు చేశారని.. దీంతో పక్కనున్న సహ ఉద్యోగులతో మాట్లాడటం కూడా ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం ఇంత అనుమానంతో వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఓ సీనియర్‌ ఉద్యోగి వ్యాఖ్యానించారు. తమ ప్రతి కదలికపైనా నిఘా పెట్టడం దారుణమన్నారు. 

సచివాలయమా.. బిగ్‌బాస్‌’ షోనా!
ఇది సచివాలయమా ‘బిగ్‌బాస్‌’షోనా అని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ 60 కెమెరాలైతే ఇక్కడ ఏకంగా 240 కెమెరాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కంప్యూటర్లలో కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తే.. ప్రశాంతంగా ఎలా పనిచేయగలమని ప్రశ్నించారు. ఏ అధికారి వద్దకు.. ఎవరు వచ్చి వెళ్తున్నారనే వివరాలను తెలుసుకునే రీతిలో కెమెరాల ఏర్పాటు చేశారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలకు ముందు మారిన మనిషినని చంద్రబాబు పదేపదే చెప్తే సంతోషించామని, కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు.

ఇప్పటికే బయోమెట్రిక్‌ హాజరు పేరుతో ఉద్యోగుల పనితీరు పట్టించుకోకుండా.. హాజరు మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. తాము సమయంతో సంబంధం లేకుండా పనిచేస్తామని, ఇప్పుడు ఈ–ఆఫీస్‌ వల్ల సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. అలాంటి తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబుకు మొదట్నుంచీ ఉద్యోగులంటే ద్వేష భావం ఉందని.. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగులను వేధించడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు డీఏ ఇవ్వకుండా ఏడిపించేవారని, ఇప్పుడు డీఏలు ప్రకటించి.. ఆ తర్వాత పెండింగ్‌లో పెట్టి తమతో ఆడుకుంటున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇదంతా చాలదన్నట్టు 50 ఏళ్లకే బలవంతంగా పదవీ విరమణ చేయించి ఇంటికి పంపించే చర్యలు కూడా చేపట్టారని వాపోయారు. 

మరిన్ని వార్తలు