ఆరుబయట వంట..వానొస్తే తంటా!

27 Dec, 2018 12:48 IST|Sakshi
మీర్జాపేట హైస్కూల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న కుకింగ్‌ ఏజెన్సీ నిర్వాహకులు

ప్రకాశం, తర్లుపాడు: కుకింగ్‌ ఏజెన్సీల బాధలు వర్ణనాతీతం. ఒక వైపు ఉద్యోగ భద్రత లేక మరో వైపు వేతనాలు, బిల్లులు సకాలంలో అందక, అధికారుల ఆకస్మిక తనిఖీలతో కుకింగ్‌ ఏజెన్సీ నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. డ్రాపౌట్స్‌ను నివారించడంతో పాటు విద్యార్థుల్లో పౌష్టికాహారం లోపాన్ని నివారించేందుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. మధ్యాహ్న భోజన పథకం  సమస్యల నిలయంగా మారింది. కుకింగ్‌ ఏజెన్సీలకు ప్రభుత్వం సరైన వసతులు కల్పించకపోవడంతో నిర్వాహకులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్లుగా సరైన వర్షపాతం లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఒట్టిపోయాయి. పాఠశాలల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది.

కుకింగ్‌ ఏజెన్సీలు వంటకు అవసరమైన నీటిని పాఠశాల సమీపంలో ఉన్న బోర్ల నుంచి తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో ఆరుబయట వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వానోచ్చినా, గాలి వచ్చినా విద్యార్థులకు పస్తులు తప్పడం లేదు. గాలి వస్తే నిప్పురవ్వలు సమీపంలోని ఇళ్లు, గడ్డివామిలపై పడతాయనే భయంతో వంట నిలిపేయాల్సి వస్తుంది. వర్షం వస్తే తడిసి వంట చేసే పరిస్థితి లేదు. రోజు రోజుకూ పెరిగిపోతున్న గ్యాస్‌ ధరలతో గ్యాస్‌ వినియోగించి వంట చేస్తే నష్టాలు తప్పవని ఏజెన్సీల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక చివరకు కట్టెలపొయ్యితోనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విద్యార్థుల్లో ఆందోళన
పాఠశాలల్లో రేషన్‌ బియ్యంతో అన్నం వండుతున్నందున అనారోగ్యపాలవుతున్నామంటూ పలువురు విద్యార్థులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా పాఠశాలల్లో వంటగదులు లేవు. చేసేది లేక నిర్వాహకులు ఆరుబయటే అభద్రత భావంతో వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలల్లో వంటగదులు నిర్మించాలని ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు