డిసెంబర్‌ 28, 29న విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమం

25 Nov, 2019 20:52 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: దేశానికి ముంబై ఎంత ముఖ్యమో.. ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం అంత ముఖ్య నగరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విశాఖపట్నంలో  ఆయన, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు డిసెంబర్‌ 28, 29 తేదీలలో జరగనున్న‘విశాఖ ఉత్సవ్‌’ బ్రోచర్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖ నగరానికి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అంతర్జాతీయంగా విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ పేరిగేలా విశాఖ ఉత్సవాలను నిర్వహించబోతున్నామని తెలిపారు. టూరిజం ప్రమోషన్లలో భాగంగా ఈ ‘విశాఖ ఉత్సవ్‌’ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి రోజుకు లక్షల మంది పర్యాటకులు రానున్నట్లు అంచనాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

అలాగే విశాఖ ఉత్సవాలకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహరెడ్డిలు ముఖ్య అతిథులుగా హజరుకానున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఉత్సవాలలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందించే విధంగా ‘విశాఖ ఉత్సవ్‌’ను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా జనవరిలో కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ను, నెల్లూరులో కైట్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్‌ వినయ్‌చంద్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, యువి రమణమూర్తి రాజు, పోలీసు కమిషనర్‌ ఆర్‌కె మీనా తదితరుల పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు