చంద్రబాబు వ్యాఖ్యల సరికాదు: బొత్స

8 May, 2020 19:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ గ్యాస్‌ లీకేజీ ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుగుతోందని శుక్రవారం మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... బాధితులందరికి పరిహారం అందజేస్తామని చెప్పారు. 17 కేంద్రాల్లో ప్రజలకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, బాధితులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించామన్న మంత్రి, ఈ విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు సరికావన్నారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. (గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ ప్రారంభం)

బాధితులను వేగంగా ఆదుకోవడం తప్పా అని బొత్స ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించడం తప్పా? అని ఆయన నిలదీశారు. సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి చౌకబారుగా మాట్లడటం దారుణమని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్‌కు తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చంద్రబాబు  తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు బుర్ర పనిచేసే మాట్లాడుతున్నారా? అంటూ ధ్వజమెత్తారు. ప్రమాద ఘటనపై చర్యలు తీసుకుంటామని చెప్పిన బొత్స, కమిటీ విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. ప్రజల క్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, బాధితుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని బొత్స స్పష్టం చేశారు. (గ్రామీణాభివృద్ధి శాఖలపై జగన్ సమీక్ష)

మరిన్ని వార్తలు