సాహితీ సౌరభం... సాంస్కృతిక వికాసం...

14 Oct, 2019 10:07 IST|Sakshi
ఫల, పుష్ప ప్రదర్శనను తిలకిస్తున్న రాష్ట్ర మంత్రి బొత్ససత్యనారాయణ

ఒకవైపు అపురూప పుష్ప సోయగాలు... మరోవైపు మనసును మైమరపించే శ్రావ్యమైన సంగీత సరాగాలు... ఇంకోవైపు లయబద్ధంగా వినిపించే శాస్త్రీయ నృత్య మంజీరాలు... మరోవైపు చూడగానే ఆకట్టుకునే రకరకాల పెంపుడు శునకాలు... నగరవాసుల్ని అమితంగా ఆకర్షించే క్రీడాసంబరాలు. ఇలా ప్రతీ వేదికా ఆకర్షణీయమే. ప్రతి అంశమూ అభినందనీయమే. విజ్ఞాన... వినోదాన్ని పంచే ప్రదర్శనలో ప్రభుత్వ పథకాలపై వినూత్నమైన ప్రచారం ఆలోచనాంశమే. ఇదీ గడచిన రెండు రోజులుగా జరుగుతున్న విజయనగర ఉత్సవ విశేషాలు. దీనికి తోడైన అమ్మవారి సంబరాలు... నగర రూపురేఖల్నే మార్చేశాయి. నగరం శోభాయమానంగా కనిపిస్తోంది.

సాక్షి, విజయనగరం : విజయనగరం ఉత్సవాలు రెండో రోజు మరింత శోభను సంతరించుకున్నాయి. అన్ని కార్యక్రమాలకు సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఎటు చూసినా కోలాహలంగా మారింది. నగరమంతా పండగ వాతావరణం కనిపించింది. ఆదివారం నాటి ఉత్సవాల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. వివిధ వేదికల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను ఆయన స్వయంగా వెళ్లి తిలకించారు. మరోవైపు గురజాడ కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ గాత్ర కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గురజాడలోనూ, సంస్కృతిక కశాశాలలోనూ పలువురు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. రెండవ రోజు డాగ్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యా, వైజ్ఞానిక, ఫల పుష్ప ప్రదర్శనలు కొనసాగాయి. కవి సమ్మేళనం, ఆనంద వేదిక’ ప్రదర్శనలు మరింతగా ప్రజలను ఆకట్టుకున్నాయి. 

పుష్ప... ఫల ప్రదర్శనకు అదే తాకిడి... 
స్థానిక ఎమ్మా సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన పుష్ప, ఫల ప్రదర్శనను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం సాయింత్రం సందర్శించారు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఎడ్లబండితో పాటు, ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఫ్లవర్స్‌ను, పండ్లను, మొక్కలను అన్నింటిని పరిశీలించి వాటిగురించి తెలుసుకున్నారు. అదేవిధంగా పైడితల్లి అమ్మవారి రూపంలో వేసిన సైకత శిల్పాన్ని, ఐస్‌తో రూపొందించిన శివలింగాన్ని కూడ తిలకించారు. ఆ తర్వాత బ్రహ్మకుమారీస్‌ ఏర్పాటు చేసిన స్టాల్‌ను కూడ చూసి వారు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించారు. సందర్శకుల కోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రధమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కోటలోని మాన్సాస్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు చేపట్టిన విద్యవైజ్ఞానిక ప్రదర్శన ఆదివారం కొనసాగింది. అందరికీ విద్య అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పథక ప్రదర్శన హైలైట్‌గా నిలింది. పట్టణ, జిల్లా వ్యాప్తంగా 145 ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు చెందిన 165 పరిశోధనా, సామాజిక చైతన్య నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. వినూత్నంగా గతంలోలేని అంశాలను ఈ ఏడాది ప్రదర్శనలో ఉంచడం విశేషం. ఈ–నాలెడ్జ్‌ హబ్, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఎగ్జిబిషన్, ఇంక్యూసివ్‌ ఎడ్యుకేషన్, స్టాంప్స్, కాయిన్స్‌ సందర్శనలు, రోబోటిక్స్‌ ప్రదర్శనలో ఉంచారు.
 
సంస్కృత కళాశాల విద్యార్థులకోసం హాస్టల్‌ 
మహారాజా సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధులకు రెసిడెన్షియల్‌ హాస్టల్‌ ఏర్పాటుకు  ప్రయత్నిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీనిచ్చారు.  విజయనగర ఉత్సవాల్లో భాగంగా సంస్కృత కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రాచీన ప్రాచ్యగ్రంథాలను, అష్టావధానం ప్రక్రియను ఆయన ఆదివారం పరిశీలించారు.  కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పెన్నేటి స్వప్న హైందవి విజ్ఞప్తి మేరకు విద్యార్థులకోసం హాస్టల్‌ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు.  విజయనగర సాంస్కృతిక సాహిత్య, కళా విశిష్టతను తమ కవితల ద్వారా ఆవిష్కరించి నగర ఖ్యాతిని చాటిచెప్పేలా కమిసమ్మేళనంలో కవితలు వినిపించిన వారిని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు సత్కరించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో నాటికలు, హరికథలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. గురజాడ కళాభారతిలో ప్రదర్శించిన నాటికలు, ఏకపాత్రాభినయాలు వీక్షకులను కట్టిపడేశాయి.  

వీనుల విందు చేసిన గానకచేరీలు 

                            సినీగీతాలాపనలో జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌
విజయనగరం ఉత్సవాల సందర్భంగా ఆనందగజపతి కళా క్షేత్రంలో రెండో రోజైన ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  గాన కచేరీలు వీనుల విందు చేసి ప్రేక్షకులను ఆలరించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌ లాల్‌ కూడా తనదైనశైలిలో సంగీత కళాకారుల చెంత చేరి వారితో గళం కలిపారు. భక్తి గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని రక్తికట్టించారు. కళాభిమానులు, ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ఆయన్ను అభినందించారు. కార్యక్రమంలో స్త్రీ నిధి రుణాలకు సంబంధించిన 142 మంది సభ్యులకు సంబంధించిన రూ.71 లక్షల విలువగల చెక్కును జిల్లా కలెక్టర్‌ డా.ఎం.హరి జవహర్‌ లాల్‌ మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు, సంగీత దర్శకుడు యం. భీష్మ సారధ్యంలో అన్నమాచార్య కీర్తనలు విజయనగరం సంస్కృతీ, సంప్రదాయం ఉట్టి పడేలా సాగింది.

విశ్వకర్మ డ్యాన్స్‌ అకాడమీ, జమ్ము నారాయణపురం బృందంచే అష్టలక్ష్మీ స్తోత్రం నత్య రూపకం ప్రదర్శించారు. కార్యక్రమాలకు హాజరైన మంత్రి బొత్ససత్యనారాయణ కళాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కార్యక్రమానికి విచ్చేసి కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఘంటసాల స్మారక కళాపీఠం ఆ«ధ్వర్యంలో నిర్వహించిన ఆర్కెస్ట్రాలో కలక్టర్‌ హరిజవహర్‌లాల్, సినీ నటి కల్యాణి, సోషల్‌వెల్ఫేర్‌ డీడీ కె సునీల్‌ రాజ్‌కుమార్‌ సినీ గేయాలు ఆలపించి శ్రోతలను అలరించారు. 

మరిన్ని వార్తలు