ఉద్యోగీ.. నీ కులమేంటి?

30 Jul, 2017 01:19 IST|Sakshi
ఉద్యోగీ.. నీ కులమేంటి?
ప్రభుత్వ ఉద్యోగుల మెడపై కత్తి పెట్టడానికి సమాచార సేకరణ ప్రారంభం
- చేరిన తేదీ, కులం, కేసుల వివరాలు నిర్దేశించిన నమూనాలో ఇవ్వాలని ఆదేశం
అత్యవసరంగా వివరాలు పంపాలంటూ ముందు వరుసలో మంత్రి లోకేశ్‌ 
అన్ని జిల్లాల పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు మెమో జారీ
వివరాలు పంపకపోతే చర్యలు తప్పవని స్పష్టీకరణ

నీ పేరేంటి..?
ఎక్కడ పనిచేస్తున్నావ్‌?
క్రమశిక్షణ కేసులున్నాయా?
రిటైర్మెంట్‌ ఎప్పుడు?
 
నీ కులమేంటి?
నీవు పుట్టిన తేదీ?
ఎస్సీ, ఎస్టీ అయితే ఏ గ్రూపు?
సర్వీసులో చేరిందెప్పుడు? 
 
సాక్షి, అమరావతి: చెప్పినట్లు పని చేయని.. నచ్చని ఉద్యోగులు, అధికారులను పనితీరు నెపంతో నిర్ణీత వయసుకు ముందే ఇంటికి పంపించే కార్యక్రమం అమలుకు వారి పుట్టు పూర్వోత్తరాలు సేకరించడం ప్రారంభించింది. కులం ఏమిటని అడుగుతూ.. కులం ప్రాతిపదికగా పనితీరు నిర్ణయిస్తామన్నట్లు వ్యవహరిస్తోంది. ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, ఆత్మన్యూనతాభావంతో కుమిలిపోయేలా చేస్తోంది. ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునే ఈ ప్రక్రియలో ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్‌.. మంత్రిత్వ శాఖ ముందుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారుల వివరాలను అత్యవసరంగా సేకరించాలని 13 జిల్లాల పంచాయతీ ఆఫీసర్లకు మెమోతో పాటు నిర్దేశించిన నమూనా పత్రాన్ని జారీ చేసింది.

ఇందులో ఉద్యోగుల కులం వివరాలు కూడా కావాలని కోరడం గమనార్హం. కులం ఆధారంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తారా? నచ్చిన కులం వారిని ఒకలా.. నచ్చని కులం వారిని మరోలా చూస్తారా? అనే అనుమానం కలుగుతోంది. ఈ మెమో అన్ని జిల్లాల పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు చేరడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయా శాఖల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగి, అధికారి.. వారి వివరాలను నిర్దేశించిన నమూనాలో ప్రత్యేక మెసెంజర్‌ ద్వారా పంపించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మెమోలో స్పష్టం చేశారు.

పనితీరు నెపంతో 50 ఏళ్లకే ఇంటికి పంపించేందుకు ఉద్దేశించిన జీవోలు ముసాయిదా రూపంలో ఉండగానే లోకేశ్‌ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పుట్టు పూర్వోత్తరాల సేకరణకు పూనుకోవడం తగదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఉదయం, రాత్రి తేడా లేకుండా పని చేస్తున్నారని, నిత్యం సమీక్షల పేరుతో ఉదయం 6 గంటలకే కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఒక్కో రోజు రాత్రి పది గంటలకు గానీ ఇంటికి వెళ్లడం లేదని ఒక అధికారి పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో రెగ్యులర్‌గా 50 వేల మంది, అవుట్‌ సోర్సింగ్‌లో లక్షన్నర మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 
 
అంతటా అదే చర్చ..
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరు దారుణం అని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘50 ఏళ్లకే ఇంటికి.. ప్రభుత్వ ఉద్యోగుల మెడపై పెర్ఫార్మెన్స్‌ కత్తి’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో వెలువడిన కథనం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. సర్కారు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందా.. అని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విషయమై ఉద్యోగులు చర్చించుకున్నారు. ముసాయిదా జీవో ప్రతులు కూడా వెలుగులోకి రావడంతో నివ్వెరపోయారు. ఒకవేళ నిజంగానే ఎవరిదైనా పెర్ఫార్మెన్స్‌ బాగోలేకపోతే అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించి పనితీరు మెరుగుపడేలా చేయాలే కానీ ఇలా ఇంటికి పంపించే కుట్ర సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేట్, ప్రైవేట్‌ కంపెనీలు కూడా వ్యవహరించని రీతిలో ఉద్యోగులను కులం ఏమిటని అడుగుతూ.. ఒకరకమైన ఆత్మన్యూనతా భావంలోకి నెడుతోందని మండిపడ్డారు. ఉద్యోగంలో చేరాక కులంతో ఏం పని? అంటూ ప్రశ్నించారు. వాస్తవానికి ఉద్యోగుల నుంచి ఇపుడు కోరిన వివరాలు ప్రభుత్వం వద్ద లేవా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 
మరిన్ని వార్తలు