మంత్రి పేరుతో మామూళ్ల దందా

30 Mar, 2016 01:24 IST|Sakshi
మంత్రి పేరుతో మామూళ్ల దందా

వసూళ్ల పర్వానికి తెరలేపిన
గిరిజన సంక్షేమ శాఖాధికారులు
విద్యార్థికి రూ.25 చొప్పున ఇవ్వాలంటూ ఒత్తిళ్లు
ఇదేమి గోలంటున్న వార్డెన్లు

 
ప్రభుత్వం ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారు.. తాము కూడా అందిన కాడికి దోచుకోవటమే నన్నట్టుగా ఉంది అధికారుల ధోరణి. అక్కడ, ఇక్కడ అనే తేడా లేదు. ధనార్జనే ధ్యేయంగా గిరిజన సంక్షేమశాఖాధికారులు మామూళ్ళ పర్వానికి తెరలేపారు. ఈ సంగతిని పక్కనబెడితే రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేరుతో దందాలు చేస్తున్నారని తెలుస్తోంది. మంత్రి కార్యక్రమాలకు ఖర్చులు అవుతున్నాయంటూ వసతిగృహంలో ఉండే ఒకో విద్యార్థిపై రూ.25 చొప్పున కేటాయించి తమకు అందజేయాలని సంబంధిత శాఖాధికారులు వార్డెన్లకు మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. - గుంటూరు వెస్ట్
 
 
జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు 31 ఉండగా అందులో 4021 మంది, పోస్టుమెట్రిక్ హాస్టళ్లు 5 ఉండగా 621 ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవికాక ఆశ్రమ పాఠశాలలు 3 ఉన్నాయి. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ.1050, 3 నుంచి 7వ తరగతి చదివే ప్రీమెట్రిక్ విద్యార్థులకు రూ.750, 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు రూ.850 ప్రభుత్వం చెల్లిస్తున్నది. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఉండే బాలికలకు నెలకు కాస్మోటిక్ చార్జీల కింద రూ.65, బాలురకు రూ.57 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. రికార్డుల్లో నమోదు చేసిన వారందరికీ నెలవారీ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సదుపాయాలు సమకూరుతాయి.

అయితే రికార్డులో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య, హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య భారీగా వ్యత్యాసం ఉంటున్నట్లు తెలిసింది. విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపించి ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలను వార్డెన్లు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. వీటిని ఆసరాగా చేసుకున్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు మంత్రి పర్యటన పేరుతో వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు సమాచారం.
 
 వసూల్‌రాజాల బాగోతం..
ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరిన నేపథ్యంలో ఆయా హాస్టళ్లకు చెందిన వార్డెన్లకు బిల్లులు ట్రెజరీల ద్వారా బిల్లులు మంజూరవుతున్నాయి. ఇదేఅదనుగా భావించిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు ఒక్కొక్క విద్యార్థిపై రూ.25 చొప్పున స్కాలర్‌షిప్ వచ్చినంతకాలం ప్రతి నెలా చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక దిక్కు తోచని స్థితిలో వార్డెన్లు కూడా అధికారులకు మామూళ్ళు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారని సమాచారం. ఈ లెక్కన మంత్రి పేరు చెప్పి వసూలుచేస్తున్న పైకం రూ 12 లక్షలకు పైగా ఉంటుందని అధికారులే అంటున్నారు.
 
 అటువంటిదేమీ లేదు..
 ఆయా ఆరోపణలపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి వి.నారాయణుడును వివరణ కోరగా అలాంటిది ఏమీలేదని అన్నారు. తనకు ఆ అవసరం లేదని చెప్పారు. కొంతమంది తనపై కావాలని ఆవిధంగా చెబుతున్నారని వివరించారు.    
 
 అక్రమార్కులపై చర్యలేవీ?
ఇటీవల గిరిజన హాస్టళ్లలో విధులు నిర్వహించే గ్రేడ్-2 వార్డెన్లకు గ్రేడ్-1 వార్డెన్లుగా నలుగురికి పదోన్నతులు కల్పించారు. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. ప్రమోషన్లు పొందినవారి నుంచి  రూ. లక్షల్లో వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈపూరులోని హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులను ఎలుకలు కొరికిన సంఘటన, రేపల్లె వార్డెన్ విధులకు హాజరుకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక లక్షల్లో నగదు చేతులు మారినట్లు కార్యాలయ అధికారులే చర్చించుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు