మీసం మెలేసిన మంత్రి!

16 Sep, 2013 09:58 IST|Sakshi
మీసం మెలేసిన మంత్రి!

రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖామాత్యులు టీజీ వెంకటేష్కు చిర్రెత్తుకొచ్చింది. సమైక్య సెగ తాకడంతో మంత్రిగారూ ఆగ్రహంతో ఊగిపోయారు. సొంతగడ్డపై పరాభవం ఎదురవడంతో ఈ రాయలసీమ లీడర్ ఫైర్ అయ్యారు. సమైక్యవాదులు చెప్పులతో స్వాగతం చెప్పడంతో కంగుతిన్న టీజీ ఉద్యమకారులపై ఒంటికాలిపై లేచ్చారు. అసలు సిసలైన సమైక్యవాదినైనా తనపైనే చెప్పులేస్తారా అంటూ కోపంతో ఊగిపోయారు. సినిమా హీరో లెవల్లో కారు దిగి మీసం మెలేసి, తొడగొట్టి సమైక్యవాదులకు వార్నింగ్ ఇచ్చారు.

కర్నూలులో ఆదివారం ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి టి.జి.వెంకటేశ్ కాన్వాయ్‌ని సమైక్యవాదులు అడ్డుకుని, రాజీనామా చేయాలంటూ నినదించారు. అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కారుపై చెప్పులు విసిరారు. దాంతో టీజీ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన టీజీ ఈ విన్యాసం చేశారు. తామేం తక్కువ తినేదన్నట్టుగా మంత్రిగారి అనుచరులు కొందరు న్యాయవాదుల దీక్షా శిబిరంపై చెప్పులు విసిరి స్వామిభక్తి చాటుకున్నారు.

టీజీ వెంకటేష్ కంటే ముందు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఈ విన్యాసం ప్రదర్శించారు. పంచెకట్టుతో తెలుగుదనానికి చిరునామాగా కనిపించే తులసిరెడ్డికి సొంత జిల్లాలోనే సమైక్య సెగ తాకటంతో ఆయన కూడా లయ తప్పారు. తొడగొట్టి, మీసం మెలేసి సవాల్ విసిరి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పుట్టపర్తి సర్కిల్లో గత నెల 28న ఆయన ఈ ఫీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు 'మీసం' విన్యాసాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు