వైద్యులను నియమించే వరకు పోరాటం

26 Nov, 2018 13:49 IST|Sakshi
రాజన్న గుండె భరోసా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌

నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌

నెల్లూరు(సెంట్రల్‌)/నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించే వరకు పోరాటం చేస్తానని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. నగరంలోని వెంకటేశ్వరపురంలో 53, 54 డివిజన్‌ల ప్రజలకు కార్తీక్‌ హార్ట్‌ సెంటర్‌ సహకారంతో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ తన సొంత నిధులతో ఉచితంగా ఏర్పాటు చేసిన ‘రాజన్న గుండె భరోసా’ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరైనా గుండెకు సంబంధించి పరీక్షలు చేయించుకోవాలంటే రూ.2500 ఖర్చు అవుతుందన్నారు. కానీ ‘రాజన్న గుండె భరోసా’ కార్యక్రమంలో మాత్రం పూర్తిగా ఉచితంగా చేయించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా 362 మందికి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 1400 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించామని, 50 మందికి యాంజీయోగ్రామ్, 25 మందికి యాంజియోప్లాస్టీ, 5 మందికి బైపాస్‌ సర్జరీలు నిర్వహించామన్నారు. ప్రతి నెలా ఈ కార్యక్రమంలో భాగంగా 100 మందికి ఉచితంగా నెలనెలా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో వైద్యుల కొరత
ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 197 మంది వైద్యులకు గాను 84 మంది వైద్యుల కొరత ఉందన్నారు. తక్షణమే వైద్యులను నియమించాలని 20 రోజుల క్రితం చెప్పినా మంత్రి నారాయణ ఇంతవరకు స్పందించలేదన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో వైద్యులను నియమించాలని చెప్పినా స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రధానంగా నారాయణ మెడికల్‌ కళాశాలను కాపాడుకునేందుకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను నిర్వీర్యం చేస్తున్నారనడంలో సందేహం లేదన్నారు. మెడికల్‌ కళాశాలలో వైద్యులను ఎందుకు నియమించరో అర్థం కావడం లేదన్నారు. 2014లో మెడికల్‌ కళాశాలకు అనుసంధానంగా రూ.48 కోట్లతో కేన్సర్‌ ఆస్పత్రి మంజూరైతే ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

కేన్సర్‌ ఆస్పత్రి వైజాగ్‌కు తరలిపోయిందని అంటున్నా స్పందన లేదన్నారు. జిల్లాలో దాదాపుగా 6 వేల మందికి పైగా కేన్సర్‌ రోగులు ఉన్నారని, వాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే టికెట్‌ల కోసం పాకులాడుతున్న టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై ఎందుకు పోరాడరని ఎమ్మెల్యే ప్రశ్నించారు.  ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో పూర్తిగా వైద్యులను నియమించే వరకు, అలాగే కేన్సర్‌ ఆస్పత్రిని నెల్లూరుకు తీసుకువచ్చే వరకు పోరాటం చేస్తానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ దేవరకొండ అశోక్, నాయకులు జాకీర్, ఎస్‌కే ముజీర్, ఎస్‌కే జమీర్, ఎస్‌.వెంకటేశ్వర్లు, ఆర్‌ జెస్సీ, నాగసుబ్బారెడ్డి, నాగరాజు, ఖయ్యూం, ఎస్‌కే మస్తాన్, డక్కా ప్రకాష్, సుభాషిణి, అన్వర్, ప్రసాద్, నాగిరెడ్డి, ఖాజా, విజయ్, కరిముల్లా, ప్రశాంత్, హర్షద్, జమీర్, సుధాకర్, దార్ల వెంకటేశ్వర్లు, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు