‘సారా’ చంద్ర‘బార్‌’ నాయుడు

25 Jun, 2017 00:50 IST|Sakshi
‘సారా’ చంద్ర‘బార్‌’ నాయుడు
ఎమ్మెల్యే రోజా ఆగ్రహం
- రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు
స్కూళ్లు మూసేసి కొత్తగా బార్లు తెరవడమే బాబు విజనా!
 
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలు చదువుకోవాల్సిన స్కూళ్లను మూసి వేసి, కొత్తగా బార్లు తెరవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు విజనా!? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్‌ కె రోజా సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా, బారాంధ్రప్రదేశ్‌గా మార్చాలని చూస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. శనివారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్‌ తీసుకు వచ్చిన సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచిన చంద్రబాబు మళ్లీ ఇపుడు ‘తాగండి... తాగించండి... చచ్చే వరకూ తాగించండి...’ అనే విధానంతో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రిని నారా చంద్రబాబునాయుడు అనే కంటే సారా చంద్ర బార్‌ నాయుడు అంటే సరిపోతుందని ఆమె వ్యంగ్యంగా అన్నారు. 30 వేల మందికో బార్‌ అంటూ కొత్తగా 85 బార్లకు లైసెన్సులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఈ లైసెన్సులు ఇచ్చినందుకు చంద్రబాబుకు, ఆయన కుమారునికి, ఎక్సైజ్‌ మంత్రికి ఎంతెంత వాటాలు మద్యం వ్యాపారుల నుంచి ముట్టాయో చెప్పాలని రోజా డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ధనదాహానికి మద్యం విధానాల వల్ల ఈ రోజు ఆడవాళ్ల జీవితాలు బలవుతున్నాయని వారి పుస్తెలు తెగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావిస్తామని, అది ఒక్క దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే చూశామని ఆమె అన్నారు.  20 మంది లోపు పిల్లుంటే స్కూళ్లు మూసేయండని తొలుత నిర్ణయించారని వ్యతిరేకత రావడంతో మళ్లీ సమీక్షించి 10 మందికి లోపు ఉంటే తీసేయమన్నారన్నారు.

అదే రాష్ట్రంలో 50 వేల మందికి ఒక బార్‌ ఉంటే ఆ జనాభాను 30 వేల మందికి తగ్గించి లైసెన్సులు ఇవ్వడం దేనికి సంకేతమని రోజా ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో ఆడబిడ్డలు పుస్తెలు తెంపుకునే పరిస్థితి, ఎంతో మంది కొడుకులు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో అవినీతి ఎంత తారాస్థాయిలో ఉందో చెప్పడానికి ఓ ఎస్‌ఐ తాను నెలకు కోటి రూపాయల మమూళ్లు ఇవ్వలేనని మొర పెట్టుకుంటూ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడమే నిదర్శనమని ఆమె అన్నారు. 
 
మీ నాన్న ఖర్జూరనాయుడు సొత్తా!?
తానిచ్చే పెన్షన్లు , రేషన్‌ తీసుకోవద్దు, రోడ్లపై నడవొద్దు అని చంద్రబాబు అనడంపై రోజా మండిపడ్డారు. ‘ఇదేమీ చంద్రబాబునాయుడు, ఆయన నాన్న ఖర్జూరనాయుడు సొత్తా లేక మీ మా ఎన్టీఆర్‌ సొత్తా... లేక నీ పుత్రుడు లోకేష్‌ సొత్తు ప్రజలకు పెడుతున్నాననుకున్నావా’ అని ఆమె ప్రశ్నించారు. ప్రజలు కట్టే పన్నులతో వారి సంక్షేమ కార్యక్రమాలు పెట్టేవాటిలో కూడా అర్హు లైన వారిని తప్పించేసి టీడీపీ వారికి ఇచ్చేసుకుంటూ ప్రజల మీద అక్కసు చూపిస్తున్నారన్నారు.
 
ప్రాణం పోయే వరకూ పార్టీలోనే...
తన ప్రాణం పోయే వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని రోజా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను పార్టీ మారబోతున్నట్లు కొందరు పనికిమాలిన వారు, పనికిమాలిన రాతలు రాస్తున్నారన్నారు. ఇలాంటి వార్తలు రాసే వారు ఏ విలువలతో కూడిన జర్నలిజం పాటిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తాను చేయని తప్పునకు టీడీపీ నాకు శిక్ష వేస్తే నాకు వెన్నంటి ఉండి నా సోదరి అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అండగా నిలిచారని ఆమె అన్నారు. రాజకీయంగా తనకు ఒక స్థానాన్ని , గౌరవాన్ని, అవకాశాన్ని ఇచ్చింది జగన్‌ ఆయన కుటుంబమేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడనని ఆమె అన్నారు. టీడీపీకి 9 ఏళ్లు సేవ చేసినా తనను ఎన్నికల్లో ఓడించిన ఆ పార్టీలోకి తాను వెళ్లబోనని, తలాతోక లేని జనసేనలోకి కూడా వెళ్లబోనని ఆమె అన్నారు.  
మరిన్ని వార్తలు